జగన్ ఏడాదిన్నర పాలనలో ఎస్సీలపై రాష్ట్ర వ్యాప్తంగా 1200కుపైగా దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనాలు, అత్యాచారాలు, అక్రమ అరెస్టులు, భూకబ్జాలుపై పోరాటంలో భాగంగా దళిత సంఘాలు చేపట్టిన ఏపీ బంద్కు తెదేపా సంఘీభావం ఉంటుందని ప్రకటించారు.
ఫాసిస్టులు, నియంతల అకృత్యాలను మించిన పాలన ఏపీలో సాగుతోందని మండిపడ్డారు. ఎస్సీలంతా మూకుమ్మడిగా ఓట్లేసి అధికారం కట్టబెట్టింది ఈ అవమానాలు భరించేందుకేనా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మనుషుల్లా చూడకుండా నియంతృత్వ ధోరణితో వారి ఆత్మాభిమానాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆక్షేపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికితే, నేడు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేశారని విమర్శించారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోకపోగా... ఎస్సీల హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.