TDP PROTEST : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యాన తోపుడు బండిపై విసనకర్రలు అమ్ముతూ తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. రాణిగారితోటలో జరిగిన కార్యక్రమంలో పాత ఫ్యాన్లు తీసుకుని స్థానికులకు విసనకర్రలు పంపిణీ చేశారు. ఆ తర్వాత కృష్ణలంక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా చేసిన నేతలు... విద్యుత్ శాఖ సిబ్బందికి విసనకర్రలు పంచిపెట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ నిరసన కొనసాగుతుందని చెప్పారు.
విసనకర్రలే గతి:కరెంట్ ఛార్జీల మోతపై కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సారథ్యంలో తెలుగుదేశం నాయకులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వంలోకి వచ్చాక ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు వరుస వాతలు పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన తీరుతో విసనకర్రలే గతి అయ్యాయన్నారు.
కొవ్వొత్తుల పంపిణీ: రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ అన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ బాపట్ల జిల్లా రేపల్లెలో నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుని.. ప్రధాన రహదారి పై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్విచక్ర వాహనదారులు, బస్సులో ప్రయాణికులకు, దుకాణదారులకు కొవ్వొత్తులు పంపిణీ చేశారు.
వినూత్న నిరసన: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో 31 పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎమ్మెల్యే బెందళం అశోక్ పిలుపు మేరకు కంచిలిలో భారీ ఎత్తున స్థానిక పెట్రోల్ బంక్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విసనకర్రలు, లాంతర్లుతో .. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలిని, విద్యుత్ కోతను ఎత్తివేయాలని నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి:ముఖ్యమంత్రి జగన్ అసమర్థత వల్లే ఐఏఎస్‌లకు శిక్ష: వర్ల రామయ్య