TDP on floods compensation: వరద సాయం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తెదేపా నేతలు ఆరోపించారు. వరదల వల్ల సర్వసం కోల్పోయిన వారికి కనీసం ఆహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని మండిపడ్డారు. ఏటిగట్లు బలహీనపడి గండి పడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందస్తు చర్యలు చేపడుతున్నా,.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఈ నెల 21, 22 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్తారని.. పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లంకలో.. వరద బాధితులను ఆయన పరామర్శించారు. నాటు పడవపై ఆ ప్రాంతానికి చేరుకుని వరద నీటిలో ఇంటింటికి వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు సరిగ్గా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించారు.
భారీ వరదలు కారణంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముంపునకు గురైన ప్రాంతాలను తెదేపా సభ్యుల బృందం పరిశీలించింది. ముంపునకు గురైన కాలనీలను పరశీలించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.