ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గతేడాది లాగానే డిజిటల్ మాధ్యమంలో దీనిని జరపాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బనగానపల్లె మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్థనరెడ్డి, తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను, అరెస్టులను పొలిట్ బ్యూరో సభ్యులు తీవ్రంగా ఖండించారు. జనార్ధన రెడ్డి ఇంటి సమీపంలో వైకాపా వర్గీయులు దాడి చేసి దాన్ని కప్పిపుచ్చేందుకు తెదేపా నేతలపై ఎదురు కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టారు. ఉన్నత న్యాయస్థానాల తీర్పుల్ని లెక్కచేయకుండా బనగానపల్లె పోలీసు, అధికారులు.. అధికార దుర్వినియోగానికి పాల్పడి జనార్థనరెడ్డిపై అక్రమకేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు.
కరోనా బాధితులకు భరోసా ఇవ్వడానికి, సహాయం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సందర్శనకు ప్రయత్నించిన తెదేపా నేతలను గృహనిర్బంధం చేయడం, అక్రమ అరెస్టులు చేయడంపై మండిపడ్డారు. వైకాపా డ్రగ్ మాఫియా ఒత్తిడితో జగన్‌రెడ్డి ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేశారని ఆరోపించారు.