ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదల నుంచి భూములు లాక్కోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పొలంలో వైకాపా నేతలు రాళ్లు పాతారన్న ఆవేదనతో కర్నూలు జిల్లా ఎర్రగూడూరులో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెదేపా నేత చలించిపోయారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో తమ భూముల స్వాధీనాన్ని అడ్డుకున్న ఎస్సీలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో భూమి కోసం ప్రాణాలకు తెగించి పురుగులమందు తాగుతామని చెప్పిన సంఘటనలు తనను కలచివేశాయన్నారు. కళ్లుండీ చూడలేని బధిర ప్రభుత్వ నిర్వాకాలకు ఈ ఘటనలు నిలువుటద్దాలని ఆక్షేపించారు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో, స్పందన కార్యక్రమాల్లో, పంట పొలాల్లో ప్రతిచోటా పురుగులమందు డబ్బాలు చేత పట్టుకుని మా భూమి జోలికొస్తే చచ్చిపోతాం అంటోన్న రైతుల ఆక్రందనలు మనసును కలచివేస్తున్నాయన్న చంద్రబాబు అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో పోస్టు చేశారు.
రైతుల ఆక్రందనలు మనసును కలచివేస్తున్నాయి: చంద్రబాబు - chandrababu tweeter news
ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అసైన్డ్ భూములు లాక్కోవడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భూమిని కన్నతల్లి కన్నా మిన్నగా భావించే రైతుల నుంచి భూములు లాక్కోవడమంటే బిడ్డ నుంచి తల్లిని బలవంతంగా దూరం చేయడమేనన్నారు. శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల అసైన్డ్ భూములు లాక్కోవడం దుర్మార్గం: చంద్రబాబు