వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. దేవాలయాలపై 80 వరకూ దాడులు జరిగితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓవైపు వరుస దాడులు జరుగుతుంటే నియంత్రించలేక తమ చేతకానితనాన్ని తెలుగుదేశంపై ఆరోపణలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసే అధికారం సీఎంకి ఎవరిచ్చారని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో అన్ని మతాలను సమానంగా గౌరవించామన్న చంద్రబాబు... వైకాపా హయాంలో అన్ని ప్రాంతాల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా... ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు కానీ, జాగ్రత్తలు కానీ లేదని మండిపడ్డారు. ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేసే పరిస్థితి ఉందని ఆరోపించారు. కనకదుర్గ ఆలయ ఘటనకు సంబంధించి ఇంతవరకూ కేసు నమోదు చేయకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈవో, మంత్రుల నుంచి కనీస స్పందన కూడా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని చంద్రబాబు ఖండించారు.
సీఎం జగన్కు పరిపాలించే అర్హత ఉందా?
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం, సోనియాగాంధీలు డిక్లరేషన్ లో సంతకం చేసినా జగన్ ఎన్నడూ చేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఆలయ దాడులకు సంబంధించి 80 సంఘటనలు జరిగితే, ముఖ్యమంత్రిగా పరిపాలించటానికి అర్హత ఉందా అని నిలదీశారు. మత సామరస్యం కాపాడటం ప్రభుత్వ బాధ్యత అయితే దాని కాలరాసి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ దేవాలయాలపై దాడులు చేసిన వారు రేపు మసీదులపై చేయరనే నమ్మకం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మొదటి సంఘటననే సీరియస్గా తీసుకుంటే వరుస ఘటనలు జరిగేవి కాదని అన్నారు. అయోధ్య భూమి పూజను ఎస్వీబీసీలో లైవ్ ఇవ్వకపోవటంతో పాటు తితిదే డైరీలు తగ్గించేయటం, బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత ప్రచారం వంటి ఘటనలు ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఇష్టానుసారం చేయటం పోలీసులకు తగదని హితవుపలికారు. ప్రజలు తిరగపడితే పారిపోవటం ఖాయమని హెచ్చరించారు.
పార్లమెంట్ ద్వారా రావాల్సిందే