మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఆధారాలున్నా ప్రభుత్వం, పోలీసులు ఎందుకు స్పందించట్లేదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వసనీయత పెరిగేలా పోలీసుల దర్యాప్తు ఉండాలని, దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాధా హత్యకు రెక్కీపై పోలీసుల దర్యాప్తు దోషులను రక్షించేలా ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఆధారాలున్నా.. కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. ఇటీవల తనపై హత్యకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో వంగవీటి రాధా నివాసానికి చంద్రబాబు శనివారం వెళ్లి పరామర్శించారు. జరిగిన ఘటనపై రాధాను, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారిని అడిగి తెలుసుకున్నారు.
"రాధాపై హత్యాయత్నానికి ఆధారాలున్నా చర్యల్లేవు. రెక్కీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?. దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉంది. రాధాపై రెక్కీ జరిగిందా లేదా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలి. పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారని అనిపిస్తోంది. రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలి. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా ? నేను డీజీపీకి లేఖ రాశా.. రాధా కూడా చెప్పారు. ఇంకేం కావాలి ? రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించలేదు. రెక్కీపై ప్రజలు నమ్మేలా పోలీసుల విచారణ ఉండాలి. వారం గడుస్తున్నా ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. నా లేఖ ఆధారంగా విచారణ చేయలేరా ? ఇలాంటి ఘటనల్లో కాలయాపన మంచిది కాదు."- చంద్రబాబు, తెదేపా అధినేత