తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, పి.గన్నవరంలో తెదేపా నాయకులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన(TDP leaders protest over yscp comments on chandrababu naidu) తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ల నిరసన తెలిపారు. వైకాపా నేతలు ప్లాట్‌ఫాం వ్యక్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెనమలూరులో ర్యాలీ చేశారు. పామర్రు ఎన్టీఆర్ కూడలి నుంచి పార్టీ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నందిగామ గాంధీ కూడలి నుంచి శివాలయం వరకు తెదేపా శ్రేణులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
వైకాపా నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కాగడాలతో నిరసన తెలిపారు. రాజాం, నరసన్నపేటలో ఆందోళనలు చేశారు. పాలకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేసిన తెదేపా శ్రేణులు..మోకాళ్లపై నిలబడి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో కాగడాలతో ఆందోళన చేశారు. వైకాపా నేతల ప్రవర్తన రాక్షసంగా ఉందని తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత విమర్శించారు.మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.- బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి
కార్యకర్తల మద్దతు..
తామంతా పార్టీతోనే ఉంటామంటూ తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని చంద్రబాబు సముదాయించారు. విజయవాడలో నిరసనకు దిగిన పశ్చిమ నియోజకవర్గ నాయకులను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో టైర్లను తగులబెట్టారు.