రేషన్ సరకుల్లోనూ పేదలను దోచుకునేందుకు వైకాపా ప్రభుత్వం ప్లాన్ చేసిందని తెలుగు మహిళ రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. రంగుల పేరుతో దుబారా సొమ్మును పేదల నుంచి రికవరీ చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం 19 లక్షల రేషన్ కార్డుల్ని తొలగించిందని మండిపడ్డారు. తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే సరకుల ధరల పెంపు దుర్మార్గమని దుయ్యబట్టారు.
రేషన్ షాపుల్లో ప్రజలు సరకులు కొనలేరు కానీ దళారులు, జగన్ లాంటి దోపిడీదారులు జేబులు నింపుకుంటున్నారని అనిత విమర్శించారు. ధరల స్థిరీకరణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఏమైందని అనిత నిలదీశారు. బియ్యం సంచుల కోసం 750 కోట్ల రూపాయలు, రంగుల కోసం చేసిన 3వేల కోట్లు రూపాయలు దుబారా కాదా అని ప్రశ్నించారు. ఈ దుబారాలు అన్నీ తగ్గించుకుంటే ధరలు పెంచే అవసరం వచ్చేది కాదన్నారు.