ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి ఉద్యమంలో ఏకమైన తెలుగుదేశం, సీపీఐ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 84 రోజుల నుంచి అమరావతి ఉద్యమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో ఇరు పార్టీల నేతలు కలసి పాల్గొంటున్నారు. ఈలోపే 'పల్లె పోరు' రావడంతో స్నేహం మరింత బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. స్థానిక నాయకత్వం సహకరించాలనే సంకేతాలు క్యాడర్‌కు పంపాయి. జిల్లా స్థాయిలో ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి రానున్నాయి. విజయవాడ కార్పొరేషన్‌తో పాటు కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవటంపై ఇరుపార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వయంగా తెదేపా అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. చంద్రబాబు కూడా జిల్లాల నాయకత్వాలకు సీపీఐతో కలసి పనిచేయాలనే స్పష్టత ఇవ్వటంతో ఎక్కడెక్కడా అవకాశాలున్నాయనే దానిపై ఇరు పార్టీలు దృష్టి సారించాయి. ఇదే సమయంలో సీపీఎంతోను తమ సంబంధాలు కొనసాగించాలని సీపీఐ యోచిస్తోంది. సీపీఎం బలంగా ఉన్నచోట తాము పోటీ చేయరాదని సీపీఐ నిర్ణయించింది. తెదేపా కూడా తమ విజ్ఞాపనకు అనుగుణంగా సీపీఎంకు అనుకూలంగా వ్యవహరించేందుకు అధినేత చంద్రబాబు అంగీకరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 13 జిల్లాల్లో పర్యటించి ప్రచారపర్వం ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు.