TDLP Meeting: పార్టీ ఎంచుకున్న దాదాపు 30 ప్రజాసమస్యలు బీఏసీలో ఆమోదింపచేసుకునేలా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన వివేకానందరెడ్డి హత్య కేసు సహా.. రాజధానిగా అమరావతి, టిడ్కో ఇళ్లు, రైతు, నిరుద్యోగ సమస్యలు వంటి అంశాలన్నీ సభలో చర్చకు వచ్చేలా చొరవ చూపాలని సూచించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉదయం అల్పాహార విందు ఇచ్చిన చంద్రబాబు.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అసెంబ్లీ నడిచినన్ని రోజులూ సభ వాయిదా అనంతరం రోజూ సాయంత్రం 5గంటలకు టీడీఎల్పీ పెట్టుకుని తదుపరి రోజు వ్యూహంపై సమావేశం కావాలని నిర్ణయించారు.