ఆంధ్రప్రదేశ్

andhra pradesh

23 ఏళ్ల బహుదూరపు బాట'సారీ'.. గూడు చేరే లోపే గుండె ఆగింది

By

Published : Apr 3, 2020, 3:17 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా వాహనాలు లేక మహారాష్ట్ర నుంచి నడుచుకుంటూ వచ్చి హైదరాబాద్​లోని మారేడ్​పల్లిలో తమిళనాడుకు చెందిన యువకుడు ప్రాణాలు విడిచాడు.

tamilanadu-guy-die-with-heart-attack-while-walking-maharashtra-to-tamilanadu
tamilanadu-guy-die-with-heart-attack-while-walking-maharashtra-to-tamilanadu

నడిచి నడిచి కానరాని లోకాలకు

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్​డౌన్ అమలు చేస్తోంది. ఎక్కడివారిని అక్కడే ఉంచి.. కరోనా వ్యాపించకుండా చూడాలని ప్రయత్నించింది. కానీ.. సామాన్య ప్రజానీకానికి లాక్​డౌన్ కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. ఉపాధి కోసం రాష్ట్రాలు దాటిన వారంతా చేతిలో పని లేక తిరిగి సొంతూళ్లకు పయనమయ్యారు. రవాణా సౌకర్యం లేక.. వాహనాలు రోడ్డెక్కక.. కాలినడకనే ఊళ్లకు పయనం కట్టారు. ఈ క్రమంలో సుదూర ప్రాంతాలకు నడిచి ఒత్తిడిని తట్టుకోలేక గుండె ఆగి ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు.

తమిళనాడులోని నామక్కల్ జిల్లా పలిప్యాలం అనే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల లోకేష్ అనే యువకుడు మహారాష్ట్రలోని వాగ్ధాలో వ్యవసాయ శిక్షణ తీసుకుంటున్నాడు. లాక్​డౌన్ శిక్షణ ఆగిపోయింది. వాహన సౌకర్యం లేకపోవడం వల్ల తనతో పాటు శిక్షణ తీసుకుంటున్న 26 మందితో కలిసి కాలినడకన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ నెల 1న రాత్రి బోయిన్​పల్లి మార్కెట్​కు చేరుకున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని గమనించిన బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ వారి వివరాలు కనుక్కున్నారు. పోలీసులకు సమాచారం అందించి వారిని మారేడుపల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్​హాల్​కి తరలించి అక్కడే భోజనం, వసతి ఏర్పాటు చేశారు. మిగతా 26 మందితో కలిసి భోజనం చేసిన లోకేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానిక పోలీసులు, కార్పోరేటర్ వచ్చి చూడగా.. లోకేష్ లో కదలిక లేదు. గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.

మహారాష్ట్రలోని వార్ధా నుంచి తమిళనాడుకు 454 కిలోమీటర్ల దూరం. తాము బయల్దేరిన ప్రాంతం నుంచి తమిళనాడు అంత దూరం ఉందని ఆ యువకులకు కూడా తెలియదు. హైదరాబాద్ మీదుగా నడుచుకుంటూ వెళ్తే 24 గంటల్లో వెళ్లవచ్చన్న అంచనాతో వారు బయల్దేరారు. నామక్కల్ నుంచి లోకేష్ స్వస్థలం 55 కిలోమీటర్లు. బుధవారం నాటికి హైదరాబాద్ చేరుకొని గురువారం చీకటి పడే సమయానికి వారు తమ స్వస్థలానికి చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ.. అప్పటికే ఎక్కువ దూరం నడిచిన కారణంగా 27 మందిలో ఒకరైన లోకేష్ శరీరంలో నీటిశాతం ఆవిరైపోవడం, బాగా అలసిపోవడం వల్ల కుప్పకూలిపోయాడు. గుండె ఆగి ప్రాణాలు వదిలాడు. శవ పరీక్షలు పూర్తయిన తర్వాత లోకేష్ మృతదేహాన్ని పోలీసులు అతని స్వస్థలానికి పంపించనున్నారు. మిగతా వారిని లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి:

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ విరాళం రూ.1.25 కోట్లు

ABOUT THE AUTHOR

...view details