విజయవాడకు చెందిన ఓ యువకుడిని కిడ్నాపర్ల చెర నుంచి తాడేపల్లి పోలీసులు రక్షించారు. కేసు నమోదైన అరగంటలోనే ఛేదించారు. విజయవాడకు చెందిన శేఖర్ అనే యువకుడు నగరంలోని ఓ వ్యక్తి వద్ద కారు తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం శేఖర్‌ను తాడేపల్లికి చెందిన కొందరు దుండగులు కృష్ణలంక వద్ద అపహరించారు.
యువకుని తండ్రికి ఫోన్ చేసి తమకు శేఖర్ అప్పు ఉన్నాడని రూ.4 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని.. లేకుంటే శేఖర్‌ను చంపేస్తామని డిమాండ్ చేశారు. దీనిపై శేఖర్ తండ్రి శనివారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు 30 నిమిషాల్లోనే యువకుణ్ని కాపాడి.. కుటుంబసభ్యులకు అప్పగించారు.