రాష్ట్రంలో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్‌శాఖ ఆదివారం నిర్వహించిన రెండో విడత ఈ-వేలంలో అత్యధిక చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం ప్రారంభ ధరపై (అప్సెట్ ప్రైస్) అదనంగా రూ.2 లక్షలు, రూ.4 లక్షలకు మించి పాడకూడదంటూ కూడబలుక్కున్నారు. కొందర్ని ప్రలోభపెట్టి, మరికొందర్ని భయపెట్టి పోటీ నుంచి తప్పించారు. ఇంకొందరితో రాజీ చేసుకుని వేలంలో పాల్గొనకుండా చేశారు. ఈ వ్యవహారమంతా ఆయా ప్రాంతాల్లోని వైకాపా ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే నడిచింది. చివరికి వారు అనుకున్నట్లుగా అతి తక్కువ మొత్తాలకే బార్ల లైసెన్సులను దక్కించుకున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, ఏలూరు తదితర నగరాలు మొదలు పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. అత్యధిక శాతం బార్లను అధికార పార్టీ నాయకులే కైవసం చేసుకున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 494 బార్లకు ఎక్సైజ్‌శాఖ ఆదివారం రెండో దశ ఈ-వేలం నిర్వహించింది.
వేలంలోనే పాల్గొనకుండా చేశారు..
- రెండో విడతలో 679 మంది వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఆదివారం నిర్వహించిన ఈ-వేలంలో 629 మందే పాల్గొన్నారు. మిగిలిన 50 మందిని వేలంలో పాల్గొనకుండా చేయటంలో స్థానిక వైకాపా నాయకుల నేతృత్వంలోని సిండికేట్లు కీలకంగా వ్యవహరించాయి.
- కాకినాడ నగర పాలక సంస్థలో మొత్తం 11 బార్లకు వేలం వేయగా.. 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. వేలంలో 11 మందే పాల్గొన్నారు. అధికార పార్టీ ముఖ్య నాయకుడి నేతృత్వంలో మిగతా ఏడుగురిని పోటీ నుంచి తప్పించారు. ఇక్కడ బార్ల వేలం కోసం ప్రభుత్వం కనీస ధరను రూ.35 లక్షలుగా నిర్ణయించింది. వేలంలో పాల్గొన్నవారు దానికి రూ.2 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. అయితే ఈ బార్లలో ఒక్కటే రూ.39 లక్షలకు పాడారు. మిగతా వాటిని రూ.37 లక్షలకే దక్కించుకున్నారు.
- తాడేపల్లిగూడెంలో అప్సెట్ ప్రైస్ రూ.35 లక్షలు. ఇక్కడ రూ.37 లక్షలు, రూ.39 లక్షలకే దక్కించుకున్నారు.
విజయవాడ, గుంటూరు, నెల్లూరులలో ముందే కుమ్మక్కు:రెండో దశలో ఈ-వేలం నిర్వహించిన 494 బార్లలో 212 విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరపాలక సంస్థల పరిధుల్లోనే ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనూ అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ 3 నగరాల్లోనూ అప్సెట్ ప్రైస్ రూ.50 లక్షలు. విజయవాడలో గరిష్ఠంగా రూ.54 లక్షలు, కనిష్ఠంగా రూ.52 లక్షలకు, గుంటూరులో గరిష్ఠంగా రూ.56 లక్షలు, కనిష్ఠంగా రూ.54 లక్షలకు, నెల్లూరులో గరిష్ఠంగా రూ.58 లక్షలకు లైసెన్సులను దక్కించుకున్నారు. అప్సెట్ ధరపై రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకే అదనంగా పెంచి పాడారు. నెల్లూరు, గుంటూరు నగరాల్లో మెజారిటీ బార్లు వైకాపా నాయకులకే దక్కాయి. విజయవాడలోనూ సగానికిపైగా బార్లు వైకాపా నేతలు, వారి సంబంధీకులే దక్కించుకున్నారు.