గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు స్వచ్ఛ సంకల్పం, క్లాప్ కార్యక్రమాలను.. ఆగస్టు 15 తేదీన సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy), బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) ప్రకటించారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చే అంశంపై.. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు.
మెరుగైన పారిశుద్ధ్యంతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచే అవకాశముందని..రాష్ట్రంలో 1320 గ్రామాల్లో మొదటి దశ, 4737 గ్రామాల్లో రెండో విడతలో నిర్వహించిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాల కారణంగా మొత్తం 680 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ స్థాయికి వచ్చాయని వారు తెలిపారు.
పరిశుభ్రతా పక్షోత్సవాల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 61,514 గ్రామాల్లో పారిశుధ్య, తాగునీటి సమస్యలను పరిష్కరించినట్టు వివరించారు. పరిశుభ్రతా కార్యక్రమాల అమలు వల్ల గతంతో పోలిస్తే మలేరియా, టైఫాయిడ్, డెంగూ వంటి వ్యాధులు 95 శాతం మేర తగ్గాయని జాతీయ సర్వేలో వెల్లడైందన్నారు. మరోవైపు స్వచ్చమైన గ్రామాలు, పరిశుభ్రమైన పట్టణాలు, నగరాలే లక్ష్యంగా ప్రభుత్వం క్లాప్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.