ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana: 'రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేలా మళ్లీ ఆదేశాలు జారీ చేయాలి'

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేలా మళ్లీ ఆదేశాలు జారీ చేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో తాజాగా మరో దరఖాస్తు దాఖలైంది. గతంలో ఎన్జీటీని ఆశ్రయించిన జి. శ్రీనివాస్​ మళ్లీ దరఖాస్తు దాఖలు చేశారు. మరోవైపు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ తెలంగాణ(telangana) ప్రభుత్వం ఇవాళ ఎన్జీటీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

By

Published : Jun 25, 2021, 5:09 AM IST

Updated : Jun 25, 2021, 5:42 AM IST

NGT
NGT

రాయలసీమ(rayalaseema) ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేలా మళ్లీ ఆదేశాలు జారీ చేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో తాజాగా మరో దరఖాస్తు దాఖలైంది. ఎన్జీటీ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా బాధ్యులైన అధికారులందరిపైనా చర్య తీసుకోవడంతోపాటు, పర్యావరణ అనుమతి లేకుండా పనులు చేస్తుండటంపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తగు ఆదేశాలు చేయాలని తాజాగా కోరారు. గతంలో ఎన్జీటీ(NGT)ని ఆశ్రయించిన జి.శ్రీనివాస్‌ మళ్లీ దరఖాస్తు దాఖలు చేయగా, తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా శుక్రవారం ఎన్జీటీకి వెళ్లనున్నట్లు తెలిసింది. శ్రీనివాస్‌ తాజాగా ఎన్జీటీకి సమర్పించిన దరఖాస్తులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • శ్రీశైలం(srisailam) నుంచి రోజుకు మూడు టీఎంసీలు తీసుకునేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకెళ్లొద్దని గత ఏడాది ట్రైబ్యునల్‌ ఆదేశించింది. అయినా పనులు చేపడుతోంది.
  • పర్యావరణ అనుమతి వచ్చిన తర్వాతే పనులు చేయాలని ట్రైబ్యునల్‌ సూచించగా, ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతే అవసరం లేదంటూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. మరోవైపు కరోనాసాకుతో కృష్ణాబోర్డుకమిటీని అనుమతించలేదు.
  • రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 240 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీనివల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు, తాగునీటికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
  • గోదావరిపై పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను 12 నెలల్లోగా పూర్తి చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది కొనసాగితే తెలంగాణకు తీవ్ర నష్టం. అందువల్ల పనులను వెంటనే నిలిపివేయాలి.

కృష్ణా ప్రాజెక్టులపై సర్వే

కృష్ణా నది(krishna river)పై కొత్త బ్యారేజి సహా పలు ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ పథకాలన్నింటికీ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న... నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రయోజనాలు, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల రైతులను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఈ పథకాలపై సమగ్ర అధ్యయనం ప్రారంభించాలని సూచించారు. శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్‌(andhrapradesh) ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో ఇప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రయోజనాలకోసం కృష్ణానదిపై బ్యారేజి సహా పలు పథకాలు చేపట్టాలని నిర్ణయించడంతోపాటు త్వరగా సమగ్ర సర్వేను పూర్తి చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ కింది నిర్మాణాలను చేపట్టనున్నారు.

  • శ్రీశైలం వెనక భాగంలో కృష్ణానదిలో తుంగభద్ర కలవక ముందు నదీ ప్రాంతంలోనే 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ బ్యారేజి.
  • భీమానది కృష్ణాలో కలిసే ప్రాంతమైన నారాయణపేట జిల్లా కుసుమర్తి గ్రామం వద్ద నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని మళ్లించేలా భీమా వరద కాలువ. (వరద సమయంలో తీసుకొనే నీరు జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్‌ వరకు ఉన్న వివిధ రిజర్వాయర్లు, చెరువులకు ఉపయోగపడేలా).
  • సుంకేశుల బ్యారేజి వెనకప్రాంతం నుంచి అలంపూర్‌, గద్వాల ప్రాంతంలోనూ, ఆర్డీఎస్‌, నెట్టెంపాడు పథకాల కింద నీరందని ప్రాంతం కలిపి రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా ఎత్తిపోతల పథకం.
  • కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా కొత్త రిజర్వాయర్లు, ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎగువ ప్రాంతంలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం లక్ష్యంగా పులిచింతల ప్రాజెక్టు వెనకభాగం నుంచి ఎత్తిపోతల పథకం.
  • నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టు, గ్యాప్‌ ఆయకట్టు లక్ష ఎకరాలకు నీరందించేందుకు నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి ఎత్తిపోతల పథకం.

ఇదీ చదవండి:కరోనాతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మృతి

Last Updated : Jun 25, 2021, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details