ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు - MP Raghuram undergoes medical examination at Secunderabad Army Hospital news

ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

By

Published : May 17, 2021, 2:12 PM IST

Updated : May 17, 2021, 4:48 PM IST

14:08 May 17

Delhi_Supreme RRR Treatment-Breaking

ఎంపీ రఘు రామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌తో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు..ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. 

'ప్రైవేట్‌ ఆస్పత్రిలో అవకాశమివ్వాలి'

బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని ముకుల్‌ రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి ఆయన వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని చెప్పారు. కేవలం బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గుంటూరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రోహత్గీ కోర్టుకు చెప్పారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో రఘురామకృష్ణరాజుకు బైపాస్‌ సర్జరీ జరిగిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  

'మంగళగిరి ఎయిమ్స్‌లో అభ్యంతరం లేదు'

అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినించారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ స్పందిస్తూ ఆర్మీ ఆస్పత్రి ఉందా ? అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్‌లో ఉందని.. అక్కడి నుంచే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని  తెలిపారు. కాగా..రఘురామ వైద్యపరీక్షలకు 10 కి.మీ దూరంలో విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. 

మంగళగిరి ఎయిమ్స్‌తో కొన్ని భయాలు ఉన్నాయి..

వైద్య పరీక్షలకు దిల్లీ ఎయిమ్స్‌ మంచిదని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌తో కొన్ని భయాలు ఉన్నాయని..అక్కడి పాలక మండలిలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని ఆయన కోరారు. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేసినందున చాలా ఇబ్బందులు ఉన్నాయని రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. ఎయిమ్స్‌కు తరలింపుపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా అన్నారు. 

ఆర్మీ ఆసుపత్రిలో ఎందుకు నిర్వహించకూడదు: సుప్రీం

పరీక్షలు ఆర్మీ ఆస్పత్రిలో ఎందుకు నిర్వహించకూడదని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ఎస్‌జీ వ్యాఖ్యానించగా.. ఇందులో రాజకీయం లేదని.. ఒక న్యాయాధికారిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సూచించింది. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.  అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం...

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు. అక్రమ కేసులు పెట్టి ఎంపీని వేధించాలన్న ప్రయత్నాలను సుప్రీం కోర్టు అడ్డుకుందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించటం ద్వారా రఘురామరాజుకు తప్పక న్యాయం జరుగుతుందని లక్ష్మీనారాయణ అన్నారు.  

ఇదీచదవండి: రఘురామ కేసు: సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

Last Updated : May 17, 2021, 4:48 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details