రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కరోనా కారణంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తోపాటు రాష్ట్రాల బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది....ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని...ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై జులైలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం వెలువరించినా...ఇంకా తాత్సారం చేస్తూ విద్యార్థుల్లో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నారని సుప్రీం ప్రశ్నించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లా మీరు ఎందుకు నిర్ణయం తీసుకోరని ప్రశ్నించింది. పదోతరగతి ఫలితాలను గ్రేడ్ల రూపంలో ఇవ్వడంతో...ఇప్పుడు మార్కుల రూపేణా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఆఖరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయడం చేయరాదన్న ధర్మాసనం....ఒకవేళ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించాలన్న పట్టుదల ఉంటే అందుకు బలమైన కారణాలు చూపించాలని కోరింది. పరీక్షల సమయంలో ఏ ఒక్క విద్యార్థి చనిపోయినా...దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని...కరోనా మూడోవేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. ఈసమయంలో పరీక్షల నిర్వహణ ప్రమాదమని సూచించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందన ధర్మాసనం కోరగా...ఆయన రెండురోజుల సమయం అడిగారు. అందుకు అంగీకరించని ధర్మాసనం...బుధవారం నిర్ణయం తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.