ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI NV Ramana: 'అదే నా చిరకాల స్వప్నం' - international arbitration center in Hyderabad

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన చిరకాల స్వప్నం.. హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్​ కేంద్రం ఏర్పాటు చేయడమేనని తెలిపారు. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ విషయంపై ఆయన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

CJI NV Ramana: 'అదే నా చిరకాల స్వప్నం'
CJI NV Ramana: 'అదే నా చిరకాల స్వప్నం'

By

Published : Jun 16, 2021, 7:44 AM IST

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం (international arbitration centre) ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల స్వప్నమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (CJI NV Ramana) వెల్లడించారు. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం, సదుపాయాలున్న హైదరాబాద్‌.. అందుకు అనువైనదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో మంచి భవనం, మౌలిక వసతులు కల్పిస్తే అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో(KCR) ప్రస్తావించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ అతిథి గృహంలో మంగళవారం తనను కలిసిన హైకోర్టు లీగల్‌ రిపోర్టర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ జస్టిస్‌ రమణ పలు అంశాలను ప్రస్తావించారు. కోర్టుల్లో కేసులు పేరుకుపోవడంతో వ్యాపార లావాదేవీల్లో వివాదాలు సత్వరం పరిష్కారం కావడంలేదన్న కారణంగా పలు అంతర్జాతీయ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపుతున్నాయన్నారు.

హైదరాబాద్‌లో ఫార్మా, ఐటీ రంగాలు పుంజుకున్నాయన్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయని, వీటికి ఏవైనా వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్‌ కోసం వ్యయప్రయాసలకోర్చి సింగపూర్‌ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇక్కడికి వస్తారని, వీరి బసకు మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తాను ఇప్పటికే సింగపూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేశ్‌ మీనన్‌తో ఈ విషయాన్ని చర్చించినట్లు చెప్పారు. ఆగస్టులో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వం తరఫున ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని.. తన పదవీకాలం ముగిసేలోగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.

కోర్టుల్లో సరికొత్త సాఫ్ట్‌వేర్‌

కోర్టులు ఇచ్చే ఆదేశాలు తమకు అందడంలేదన్న కారణంగా విచారణల్లో జాప్యం జరుగుతోందని, ఇలాంటి సమస్య లేకుండా కోర్టు ఇచ్చే ఉత్తర్వులను అప్‌లోడ్‌ చేసిన వెంటనే అవి కక్షిదారులు, ప్రతివాదులందరికీ మెయిల్‌ ద్వారా చేరేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు ప్రయత్నాలు సాగుతున్నాయని జస్టిస్‌ రమణ వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను అన్ని కోర్టుల్లోనూ ప్రవేశపెట్టిన వెంటనే నోటీసులు, తీర్పులతో పాటు అన్ని వివరాలు అందుతాయన్నారు.

కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఇంకా కొన్ని అడ్డంకులున్నాయని, కర్ణాటక, గుజరాత్‌ హైకోర్టులు యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలకు కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. దేశభద్రత, ప్రైవసీకి సంబంధించినవి ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే కుదరదని, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగానే ఉంటుందని చెప్పారు.

ఇవీ చూడండి:

Inter Exams: వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు

టీమ్ఇండియా టెస్టు ప్రయాణం చరిత్రాత్మకం!

ABOUT THE AUTHOR

...view details