Superstition Crimes : తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండలో మహంకాళి పాదాల దగ్గర మొండెం లేని తల కనిపించిన ఉదంతం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో టీసీఎస్ ఉద్యోగి శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు భార్య, కూతురు నుదుట బొట్లతో విగతజీవులుగా మారిపోయిన వైనం.. జగిత్యాల జిల్లాకేంద్రంలో పట్టపగలే నాగేశ్వర్రావుతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను బరిసెలతో పొడిచి చంపేసిన ఉన్మాదం.. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం కాషాగూడెంలో గోరిమియా కుటుంబంపై కర్రలతో తెగబడిన దురాగతం.. కేవలం పది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూసిన దారుణాలివి. పేదా ధనికా.. తేడా లేదు. అక్షరాస్య, నిరక్షరాస్యులనే భేదం లేదు. ఉన్నదల్లా ఒక్కటే మూఢవిశ్వాసం. అదే వీటికి కారణం.
శాస్త్రసాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మూఢవిశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య మదనపల్లె దురాగతం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో భార్యభర్తలు, కూతుళ్లిద్దరూ విద్యాధికులే. అయినా అంతా కూడబలుక్కుని క్షుద్రపూజలకు బానిసలుగా మారిన వైనం నివ్వెరపరిచింది. ఇలాంటి ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వెలుగుచూస్తున్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కాదు.. హైదరాబాద్‌తోపాటు పరిసరాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి.
జీనోమ్‌వ్యాలీ లాంటి అత్యాధునిక హంగులున్న శామీర్‌పేటలో రెండేళ్ల కిందట మంత్రాల నెపంతో కాలుతున్న చితిలోనే ఓ వ్యక్తిని పడేసి సజీవదహనం చేసిన దారుణం విస్తుపోయేలా చేసింది. రంగురాళ్లతో జాతకం మార్చేస్తామంటూ సర్వం దోచుకెళ్లే దొంగబాబాల లీలలు సాధారణమయ్యాయి. పాతబస్తీలో ఇలాంటి బురిడీబాబాల ఆగడాలు ఇప్పటికీ రాజ్యమేలుతూనే ఉన్నాయి. గత ఏడాది ఖమ్మం జిల్లా మధిర, ఆసిఫాబాద్ జిల్లా ధనోరా(పి), జగిత్యాల జిల్లా కేంద్రం టీఆర్‌నగర్, కొడిమ్యాల, సూర్యాపేట జిల్లా యర్కారం, మోతె, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలలో పలు దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి దురాచారాలను రూపుమాపే దిశగా చిత్తశుద్ధితో కూడిన కృషి జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో అత్యధికం
జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం మంత్రాలు చేస్తున్నారనే నెపంతో 2020లో దేశవ్యాప్తంగా 88 హత్యలు జరిగాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 17, ఛత్తీస్‌గఢ్‌లో 16, ఝార్ఖండ్‌లో 15, ఒడిశాలో 14 చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ల్లో 4 చొప్పున, గుజరాత్, మహారాష్ట్రల్లో 3 చొప్పున, మేఘాలయాలో 2, తెలంగాణ, రాజస్థాన్‌ల్లో ఒక్కోటి వెలుగుచూశాయి.