రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ విమర్శించారు. విజయవాడలో సీతాదేవి విగ్రహం కూల్చటం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 150 వరకు ఘటనలు జరిగాయన్నారు. దాడులు నియంత్రించటంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఘటన జరిగిన ప్రదేశాలను మంత్రులు పరిశీలించకపోవటం దారుణమన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా...దేవాదాయ శాఖ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క కేసులో కూడా దోషులను పట్టుకోలేక పోయారని విమర్శించారు. రామతీర్థం విషయంలో రాజకీయం చేయటం సరికాదని హితవు పలికారు. దేవాలయాల ఘటనపై చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని..ఆయన సీఎంగా ఉన్నప్పుడు 50 ఆలయాలను దుండగలు ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని దేవధర్ హెచ్చరించారు.