FARMERS PROBLEMS : నిర్ణయించిన ధరకు కాగిత పరిశ్రమల ద్వారా సుబాబుల్, యూకలిప్టస్ కర్రను కొనుగోలు చేయించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 4 జిల్లాలో ఎక్కువగా సాగులో ఉన్న ఈ రెండు పంటలు.. సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సుబాబుల్ పండిస్తుంటే.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో యూకలిప్టస్ అధికంగా వేశారు. ఈ కర్రకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధర నిర్ణయిస్తున్నారు. టన్ను సుబాబుల్ ధర 4 వేల200 రూపాయలు, యూకలిప్టస్ టన్ను ధర 4 వేల 400 రూపాయలకు కొనుగోలు చేయాలని గత ప్రభుత్వంలోని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. కానీ.. కాగిత పరిశ్రమలు మాత్రం ససేమిరా అంటున్నాయి.
నష్టాలతో ప్రత్యామ్నాయ పంటల వైపు..
సాగునీటి వసతి లేని భూముల్లో మాత్రమే సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు తోటలు సాగు చేస్తున్నారు. కాగితపు పరిశ్రమలు కూడా రైతులను సాగుకు ప్రోత్సహించాయి. తీరా కర్ర కొట్టే సమయానికి ధర తగ్గించి తీసుకుంటున్నాయి. యూకలిప్టస్ టన్ను 2 వేల 200 వందల రూపాయల చొప్పున కొన్నాళ్లు కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్ టన్ను 3 వేల 200 రూపాయలకు మించి కొనడం లేదు. ఏటా ధర పడిపోవడంతో కొందరు రైతులు తోటలు తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు నీటి వసతి మెరుగుపడడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లోనే సుమారు 30 వేల ఎకరాల వరకు సుబాబుల్ కొట్టేశారు. ప్రత్యామ్నాయంగా పత్తి, మిర్చి సాగు వైపు మళ్లారు. ఇతర పంటలకు కౌలుకు ఇచ్చినా ఎకరానికి పది వేల రూపాయలకు తక్కువ కాకుండా వస్తుందనే అభిప్రాయం రైతుల్లో ఉంది.