రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఘటనపై మంత్రి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశాన్ని విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలని, అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు విలేకర్ల సమావేశం వద్దకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి విలేకర్ల సమావేశాన్ని కొంత సమయం వాయిదా వేసి, వారితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రికి విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం సాగింది. ఎయిడెడ్‌కు గ్రాంటు నిలిపివేస్తే యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తాయని, వాటిని విద్యార్థులు ఎలా చెల్లిస్తారని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. అనంతపురం పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి వారికి సమాధానమిస్తూ అనంతపురం కళాశాల యాజమాన్యం సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపిందని, ఎయిడెడ్ విషయంలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కళాశాలలు ప్రైవేటుగా మారినా ఉన్నత విద్య కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులతో మంత్రి చర్చిస్తున్న సమయంలోనే పోలీసులు వారిని చుట్టుముట్టారు. వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం విద్యార్థులపై దాడులు చేయడం దుర్మార్గమని, ఎయిడెడ్ విద్యా సంస్థల కొనసాగింపుపై మంత్రి అవాస్తవాలు, వక్రీకరణలు చెబుతున్నారని విమర్శించారు.
విద్యార్థులను అరెస్టు చేసి వ్యానులోకి ఎక్కిస్తున్న పోలీసులు