డీఎడ్-2020 కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. మొదటి విడత సీట్ల కేటాయింపులో 412 కళాశాలలను చూపిన అధికారులు, విద్యార్థులు చేరిన తర్వాత 337 కళాశాలల అనుమతులు రద్దు చేశారు. ఒవైపు విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీట్లు కేటాయింపు పూర్తి చేయడం లేదు. ఏదైనా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్‌కు నెల, రెండు నెలలు సమయం పట్టడం సాధారణం. కానీ డీఈఈసెట్-2020 ఏడాది పూర్తైనా కొనసాగుతూనే ఉంది. గతేడాది జూన్‌లోనిర్వహించిన డీఈఈసెట్‌కి దాదాపు 11వేల మంది హాజరయ్యారు. వీరిలో 8వేల మంది వరకు అర్హత సాధించారు. వీరికి మొదటి విడత కౌన్సెలింగ్‌లో అర్హతల ప్రకారం 4 వేల వేలమందికి సీట్ల కేటాయించారు.
ఆగమ్యగోచరంగా విద్యార్థుల పరిస్థితి
మొదటి విడత కౌన్సెలింగ్ సమయంలో 14 ప్రభుత్వ, 412 ప్రైవేటు కళాశాలలను చూపారు. వీటిల్లో 36,730సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో పెట్టారు. విద్యార్థులు వారికి నచ్చిన విద్యా సంస్థలను ఎంచుకొని ప్రవేశాలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు 337 కళాశాలల అనుమతులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వీటిల్లో చేరిన 1,700మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనుమతులు రద్దయిన కళాశాలల్లో చేరిన వారిని 75కళాశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉండగా.. సీట్లు సరిపోకపోవడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు. రద్దైన వాటిల్లో తెలుగు మాధ్యమం విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు సీట్లు అందుబాటులో ఉన్నా.. ఆంగ్ల మాధ్యమంలో సరిపడా సీట్లు లేవు.