రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బోధన రుసుములను నిర్ణయించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిసెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు ప్రవేశాలే పూర్తి కాలేదు. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం విద్యార్థులు కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్నారు.
మొదటిసారి ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు..
ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా చేపడుతున్నారు. విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు, బోధన రుసుముల నిర్ణయం, ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలకు నమోదు చేసుకున్న కళాశాలలకు అనుమతివ్వాలనే నిబంధనను ఉన్నత విద్యామండలి తీసుకొచ్చింది. కానీ, కొన్ని మైనారిటీ, స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలు ఆన్‌లైన్ ప్రవేశాల కోసం రిజిస్టర్ చేసుకోలేదు. కొన్ని స్వయం ప్రతిపత్తి కళాశాలలు ముందుగానే ప్రవేశాలు నిర్వహించుకున్నాయి.