sirivennela-sitarama-sastry: సీతారామశాస్త్రి అక్షరాలు.. జ్వలించే శతఘ్నులు. జనచైతన్యానికి ఎక్కుపెట్టిన ఫిరంగులు. చిన్నతనం నుంచి రచనలపై అమితమైన ఆసక్తి. దేశభక్తి మెండు. తన అంతరంగంలోని అనురక్తిని భక్తిగా కంటే దేశంపట్ల తన అక్కరగా భావించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక దేశభక్తి గీతాలు రాసే అలవాటున్న ఆయన.. అనేక కార్యక్రమాల్లో ఆ గీతాలను తానే స్వయంగా ఆలపించేవారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో 'సిరివెన్నెల' అనుభూతి..
"సమాజంలో తానూ ఓ మనిషిని అనుకునే కంటే - "సంఘం"లో ఓ జీవిగా శాస్త్రి నిలిస్తే అదే తనకు సంతోషం"
-ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాల్లో శాస్త్రి అంతరంగం..
"ఒకరు మెచ్చుకుంటారనో, ఒకరు తిడతారనో కాదు - సమాజంలో ఒక వ్యక్తిగా నా గౌరవాన్ని నేను రాసిన అక్షరం నిలబెట్టేలా ఉండాలి. సామాజిక బాధ్యత అని, అదేదో బరువులా, దూరంగా ఉండే భావనలా ఆలోచించకుండా, ఇది నా స్వంత గర్వం, అభిమానం - వీటిని ఈ వృత్తిలో నేను నిలబెట్టుకోవాలి అని ఆలోచించుకుంటే బాగా పాటించవచ్చు"
-సిరివెన్నెలసీతారామశాస్త్రి.
- 1984 అనకాపల్లిలో జరిగిన సంఘ్ శిక్షా వర్గ్‌లో అప్పటికప్పుడు ఓ పాట రాసి..పాడారు.
"కారు చీకటిని చీల్చి వెలుతురును పంచే రవికిరణాలై... జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలై.. భావి జీవితపు ఆదర్శానికి గడిచిన కాలం వెతకండి.. ఆశయ పథమున నడిచిన నేతల ఉత్తేజముతో బతకండి.. వందేమాతరం వందేమాతరం వందేమాతరం" అని తన గొంతుతో ఆ పాట వినిపించారు."
- కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపించిన దివిసీమ ఉప్పెన సీతారామశాస్త్రి హృదయాన్ని కదలించింది. దివిసీమ ఉప్పెనలో స్వయం సేవకుల సేవా నిరతికి అక్షరాలతో ఇలా...
అదిగో ఆశనిరాశల కురుక్షేత్రమున కేశవ సమూహమిదిగో...
"దివ్యసీమ మా దివ్యసీమ.. భోగభాగ్యముల బంగరుసీమ... భూలోకంలో నాకముచూకిన రమ్యసీమ రతనాలసీమ... మానసేవకు వచ్చిన మాధవసేనావాహిని అదిగో ఆశనిరాశల కురుక్షేత్రమున కేశవ సమూహమిదిగో.."
అంటూ ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్, గోల్వాల్కర్‌లను ఉటంకిస్తూ గీతం రాశారు.
ఆర్‌ఎస్‌ఎస్ సేవకులను ఉద్దేశిస్తూ..
కాకినాడలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం మెట్లమీద కూర్చొని దేశభక్తి గీతాన్ని అలవోకగా రాసి స్వయం సేవకులకు వినిపించారు..
"విశ్వభారత వీర లేవోయీ ప్రగతి పథముల వెంట పదవోయీ స్వాతంత్య్ర వీరుండు రాణా ప్రతాపుండు నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా వీరాభిమన్యుండు పలనాటి బాలుండు నీ సహోదరులురా లయ ఝంఝ వీవురా ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరా కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా మగువ మాంచాల నీ బంగారు వదినరా వీర వంశము నీది వీర రక్తమ్మురా పదునాల్గు భువనాల నిన్నడ్డు మొనగాడు లేడురా జగదేక వీరుడవు నీవెరా శివ సముద్రమ్మువై బడబాగ్ని జ్వాలవై లంఘించి వెలుగరా లోకాలనేలరా"
- సినిమాల్లోనూ అదే పంథా..50 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవంపై..
"అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!"
"కులాల కోసం… గుంపులు కడుతూ మతాల కోసం… మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి… తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని… స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ… మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే… తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం… ఈ చిచ్చుల సిందూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా… ఓ అనాథ భారతమా!"
సీతారామశాస్త్రి ప్రతి పదం పలుకుతుంది– ప్రతి పాట తలెత్తుకు నిలుస్తుంది. సమాజంలోని రుగ్మతలపై మదనం చెందారు. అక్షరాలతో నిత్య సంఘర్షణ చేశారు. ప్రజల అచేతనాన్ని తట్టుకోలేకపోయారు. నిగ్గదీసి అడగాలని పిలుపునిచ్చారు.
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ..
"నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్ఠం.. కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం".
"కాషాయ ఛాయలో ఉదయిస్తున్న సూర్యున్ని పనిగట్టుకుని ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతున్నారు..
ఓటు కోసం కులాలను బతికిస్తున్నారు.. దేవుళ్లపై విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారు.."- శాస్త్రి
కులంపై.. కలంతో దాడి..
చాలా మందిలో రాజ్య భక్తి కంటే రాజభక్తి పెరిగిందని నిర్వేదం చెందారు. 1947కు ముందు కులాలున్నాయి.. కలహాలున్నాయి.. ఇప్పుడు కులాలు లేవు.. కలహాలున్నాయి... ఓటు కోసం కులాలను బతికిస్తున్నారని... ఏడ్చారు.
దేశభక్తి అనేది లోపల నుంచి ఉప్పొంగి రావాలి..
దేవతామూర్తులపై విమర్శలకు గట్టిగా బదులివ్వలేకపోతున్నారని నిట్టూర్చారు. దేశభక్తి అనేది లోపల నుంచి ఉప్పొంగి రావాలని పిలుపునిచ్చారు. అందుకే సీతారామశాస్త్రి నిజంగా అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరిన కవన రుషి. తన అంతరాత్మనే కాదు.. ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని గట్టిగా నమ్మిన సిరివెన్నెల చీకట్లోకి జారుకోవడం మాటలకందని విషాదమే.
ఇదీ చదవండి:sirivennela cremation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు