Vijayawada Book Festival: గతేడాది కొవిడ్ కారణంగా రద్దైన పుస్తక విజయవాడ మహోత్సవాన్ని ఈసారి పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో లక్షల సంఖ్యలో పుస్తకాలు కొలువుదీరాయి. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ తరలివచ్చి.. సుమారు 200 స్టాళ్లలో పుస్తకాలను ఏర్పాటు చేశాయి. ఈ నెల 11 వరకూ జరిగే 32వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెబినార్ ద్వారా ప్రారంభించారు.తన వంతు సాయంగా ఉత్సవాలకు రూ. ఐదు లక్షలు అందించారు. చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని పిల్లలకు అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు.
Governor Biswabhusan Harichandan to inaugurate 32nd book festival: "పుస్తకం ఒక మంచి మిత్రుడు వంటింది. అది పాఠకుడి నుంచి తిరిగి ఏదీ ఆశించదు. పుస్తకం పాఠకుడితో ఎప్పుడూ వాదించదు. పుస్తకాలు మన జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. నేనొక రచయిత, పుస్తకప్రియుడిగా.. చిన్న వయసు నుంచే పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాల్సిందిగా తల్లిదండ్రులకు కోరుతున్నా" - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
ప్రముఖ తెలుగు, ఆంగ్ల, ప్రభుత్వ ముద్రణ, ప్రచురణ సంస్థలు పెద్ద ఎత్తున పుస్తకాలతో ఉత్సవంలో పాల్గొన్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్నికల సంఘం, గిరిజన సంక్షేమ సంఘం, ఎస్సీఈఆర్టీ.. తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. తొలిరోజే పుస్తక మహోత్సవానికి సాహితీ ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది.