ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పందిళ్లు వదిలేసి..ఇళ్లకే పరిమితమైన గణనాథుడు - ganesh festival corona effect

అబాల గోపాలం సందడిగా జరుపుకొనే పండగ వినాయక చవితి. కరోనా కలకలం కారణంగా ఈ ఏడాది వినాయకుని పండగకే విఘ్నాలు కలిగాయి. పల్లె వీధుల నుంచి నగర ప్రధాన రహదారుల్లో కొలువై ఆశీస్సులిచ్చే గణనాథుడు ఈసారి మాత్రం సామాజిక దూరం పాటిస్తున్నాడు. స్టే హోం-స్టే సేఫ్‌ అంటూ వేడుకలు లేకుండా భక్తులు నిబంధనలు పాటించాలని చెబుతున్నాడు.

story of ganesh chathurdhi2020 differnet celebrations of vinayak chavithi due to corona effect
story of ganesh chathurdhi2020 differnet celebrations of vinayak chavithi due to corona effect

By

Published : Aug 22, 2020, 12:18 PM IST

తొలి పూజలందుకునే ఆది దేవుడు గణపతి. ఆధ్యాత్మిక ఆనందఝరి వినాయక చవితి. రాబోవు ఆపదల నుంచి గట్టెక్కించమని మంచి కార్యాలకు ఎటువంటి అడ్డంకులు రావొద్దని భక్తి పూర్వకంగా గణేశున్ని ప్రార్థించే శుభదినమిది. ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఉవ్విళ్లూరే వినాయక చవితి మహోత్సవాలపై కరోనా మహమ్మారి తన విషపు చూపును ప్రసరింపజేసింది. విఘ్నాలకే అధిపతియై అభిఘ్నమస్తు అంటూ మనలను ముందుకు నడిపించే వినాయకుని నవరాత్రి ఉత్సవాలు కరోనా దెబ్బకు కళావిహీనమయ్యాయి. ఊరూ.. వాడా దేవాలయ ప్రాంగణాలు, వీధి కూడళ్లలో కొలువై మనలను దీవించే వినాయక స్వరూపాల ఏర్పాటుకు అంతరాయం కలిగింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా మండపాల ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వహణ, కోలాహాలు లేకుండా పోయాయి. ఏటా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు నేడు కానరావడం లేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఏయేటి కాయేడు విగ్రహాల పరిమాణం పెరుగుతూ మారుతున్న కాలానుగుణంగా పర్యావరణ హితంగా వివిధ, విభిన్న కళాత్మక రూపాలను దిద్దుకొని జనావళికి దర్శనమిచ్చే మహా గణపతి రూపం ప్రస్తుతం కొవిడ్‌ ఆంక్షల ఫలితంగా మూడడుగులకే పరిమితమైంది.

కాంతులీనకపోయే...

వినాయక చవితి పర్వదినం సందర్భంగా 21 రకాల పూజా ద్రవ్యాలతో నవకాయ పిండివంటలతో ఇంటిల్లిపాది పూజించుకునే గణపతి పూజ వైభవం ఈ ఏడాది తగ్గింది. పూజాద్రవ్యాలు విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు కరోనా వ్యాప్తికి భీతిల్లుతున్నారు. దీంతో పండగ సంత కాస్త తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇంట్లో ఉన్న పూజాద్రవ్యాలతో అందుబాటులోని సామగ్రితోనే పండగను కానిచ్చేస్తున్నారు. 3, 5, 9 రోజులు ఆర్భాటంగా జరుపుకొనే వినాయక ఉత్సవాలు నేడు 1, 2 రోజులకే పరిమితమయ్యాయి. తోపుడుబండ్ల మీదనే కాకుండా.. రకరకాల రంగు రంగుల ఆకృతులతో వినాయక ప్రతిమలు ఏడాది పాటు తయారు చేసి అమ్ముకొని జీవించేవారు.. పెద్ద గృహ పరిశ్రమగా భారీ ఆకృతులతో గణపతి విగ్రహాలను శ్రమకోర్చి రూపొందించే కుటుంబాలు నేడు కళ తప్పాయి. ప్రతిమల తయారీపై ఆధారపడ్డ కుటుంబాలు కష్టాల పాలయ్యాయి. మోదక ప్రియుని లడ్డూ ప్రసాద వేలాలు జిల్లా వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. రూ.వేలల్లో పాడుకొనే ఈ వేలం పాటలు కూడా అమిత ఆసక్తిని ఉత్సాహాన్ని కలిగించేవి.. ఇవన్నీ ప్రస్తుతం లేకపోవడం భక్తులను నిరాళపరిచాయి. మండపాలు ఏర్పాటు చేసేవారు, విగ్రహాలు తయారీదారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఉత్సవాల్లో పాలుపంచుకుని పది రూపాయలు సంపాదించుకుందామని ఎదురుచూసిన లైటింగ్‌, అలంకరణవాళ్లు, భజన బృందాలు దారుణమైన అనుభవాన్ని చవిచూస్తున్నారు. ఇక ‘పత్రి’ అమ్మేవాళ్ల పరిస్థితి కూడా అంతే. వారం రోజులపాటు పూజలు, హోమాలు నిర్వహించి తృణమో ప్రణమో పుచ్చుకుందామనుకున్న అర్చకుల ఆశలు అడియాశలే అయ్యాయి. మండపాలతో సందడిగా వెలగాల్సిన వీధులు, సందులు వెలవెలబోతున్నాయి.

కరోనా నుంచి విముక్తికి వేడుకోలు...

ఫలం, పత్రం, పుష్పం, తామ్రం అన్నట్లు గణనాథుని పూజకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నదాంతో భగవంతునికి అర్పించి పూజించుకుందాం. విఘ్నరాజు అయిన గణపతి దేవుడు తన కరుణాపూరిత దృక్పథంతో సమాజాన్ని కాపాడుతూ కరోనా రక్కసి కర్కశ బాహువుల నుంచి త్వరగా విడిపించి తిరిగి సాధారణ జీవితం కొనసాగించేలా అనుగ్రహించాలని కోరుకుందాం.

ఇదీ చూడండి

ఉండ్రాళ్లయ్య..ఊరడించాలయ్యా!

ABOUT THE AUTHOR

...view details