ఏటా భాద్రపద మాసం, శుద్ధ చవితి రోజున జరుపుకొనే వినాయక చవితి పండగలో ప్రకృతి ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. మనం తెలుసుకుని, పిల్లలకు చెప్పడానికి ఉపయోగపడే అంశాలెన్నో కళ్లకు కడతాయి. వినాయకుడి రూపమే ప్రకృతికి సమీపంగా ఉంటుంది. ఆయన గజముఖుడు. గజం అంటే ఏనుగు. అది శాకాహారి. రుచికరమైన చెరుకును ఇష్టంతో తింటుంది. శాకాహారులు బలహీనంగా ఉంటారనడాన్ని అబద్ధం చేసేది ఏనుగే. అత్యంత శక్తిమంతమైన జంతుజాలంలో ఏనుగు ఒకటి. ప్రకృతి బలమే ఏనుగు బలం. విఘ్నాధిపతి అర్చనలోనూ ప్రకృతి పాత్రే కీలకం. ప్రకృతిలో దొరికిన ప్రతీ ఆకూ స్వామి వారి అర్చనకు అర్హమైందే అన్నది ఈ పండగ ద్వారా తెలుస్తుంది. వినాయకుడి విగ్రహాన్ని మట్టితోనే చేయాలంటారు. దానికీ కారణం ఉంది. సాధారణంగా వానలు ఆషాడం నుంచి మొదలై శ్రావణం, భాద్రపదం వరకూ కురుస్తాయి. భాద్రపదంలో తక్కువగా కురిసినా చెరువులు నిండిపోతాయి. వాటిల్లో చేరిన నీరు పైకి పొంగితే ప్రమాదం. అందుకే ఆ చెరువుల్లో ఉన్న మట్టిని పూడిక తీసి దాంతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేస్తారు. ఇలా పూడిక తీయడం వల్ల అదనంగా చేరిన నీరంతా లోపలికి ఇంకుతుంది. అయితే వూరికొక విగ్రహం కాకుండా... ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఓ మట్టిబొమ్మను స్వయంగా చేసుకుని పూజ చేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నాయి పురాణాలు. పైగా మట్టి అంటే శ్రేష్ఠమైన భావన. తొమ్మిది రోజులయ్యాక ఆ విగ్రహాన్ని మళ్లీ అదే నీళ్లలో కలుపుతారు. దాంతో తీసిన పూడిక మొత్తం సర్దుకుంటుంది.
ప్రతి భాగమూ పాఠమే..
వినాయకుని వృత్తాంతం, ఆయన రూపం, మట్టిలో పుట్టి మట్టిలో కలసిపోయే స్వభావం... అనేక విషయాలను తెలియజేస్తాయి. చాటంత చెవులూ, పెద్ద పొట్ట, చిన్ని కళ్లూ, ఏనుగు ముఖం, నోటికి అడ్డంగా తొండం... వీటిలో ప్రతి దాని వెనకా ఓ పరమార్థం ఉంది. తక్కువ మాట్లాడమని నోటికి ఆడ్డుగా ఉన్న తొండం సూచిస్తే, ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలని చెవులూ, ఆ విన్న వాటిని భద్రంగా దాచుకోవాలని కడుపూ చెప్పకనే చెబుతాయి. వినాయకుడి సూక్ష్మ దృష్టికి నిదర్శనం అతని చిన్ని కళ్లు. ముక్కోటి దేవతలూ తల్లిదండ్రుల తరవాతే అని తన అంతర్నేత్రంతో గ్రహించాడు కాబట్టే వాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి సకల దేవతలనూ మెప్పించాడు. విఘ్నాధిపతిగా అవతరించాడు. ఏదైనా కార్యం సాధించాలంటే కావల్సింది శక్తియుక్తులే కానీ సౌకర్యాలూ, ఆర్భాటాలూ కావని అతని ఎలుక వాహనం సూచిస్తుంది. ఇలా గణపతి అణువణువులో ఒక్కో విశిష్టత దాగుంది.
దొరికిన వాటితోనే అలంకరణ..
పాలవెల్లిని గమనిస్తే.. ఈ పండక్కి చేసే అలంకరణలన్నీ సహజంగానే ఉంటాయి. వెల్లి అంటే ప్రవాహం. పాలవెల్లి అంటే పాల ప్రవాహం. దానికి కట్టే మొక్కజొన్న, వెలగ, జామకాయ, సీతాఫలం అన్నీ పాలకంకుల దశలోనే ఉంటాయి. ఎందుకంటే.. ఆషాడంలో విత్తనాలు వేస్తారు. భాద్రపద సమయానికి పంట లేత దశలోకి వస్తుంది. ఈ కాలంలో అవే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి.. అవి ఎలా ఉన్నాయో వాటితోనే పూజ చేయమంటారు. వినాయకుడు ఎప్పుడూ బాలుడే. అందుకే ఆ దశలో ఉన్నవే కట్టాలని కూడా పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడి పూజకు వాడే పత్రిలో ఆకులూ, కాయలూ, పువ్వులూ, పండ్లూ ఉంటాయి. వీటిలో ఎనలేని ఔషధగుణాలుంటాయి. కేవలం వాటిని తాకడం వల్లే కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయి. కొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్నిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి. అందుకే, ఇరువది యొక్క పత్రముల నీశ్వరపుత్రుని పూజచేయుటన్... పరమ రహస్యమీ ప్రకృతి పావనభావనయే గదా! విష జ్వరములు వింతవ్యాధుల నివారణ కియ్యవి కల్పవృక్షముల్... అంటారు. పూర్వం ఆయుర్వేద వైద్యం చేసే ఆచార్యులకు మాత్రమే వీటి గుణాలు తెలుసు. అవి అందుబాటులో ఉండి, వైద్యానికి ఉపయోగపడాలంటే వాటి గురించి అందరికీ తెలియాలి. అందుకే చవితికి అవసరమైన పత్రిని ఇరుగుపొరుగు వారిళ్లకు వెళ్లి తెచ్చుకోమంటారు. దానివల్ల ఎవరింట్లో ఎలాంటి ఔషధ మొక్కలున్నాయనేది తెలుస్తుంది. ఈ పత్రిని పిల్లలు సేకరించేలా పెద్దవాళ్లు ప్రోత్సహిస్తారు. మాచీ, బిల్వ, శమీ, మారేడు, బృహతీ, బదరీ, కరవీరా, దాడిమీ, జాజి, విష్ణుక్రాంత, చూత... ఇలా పత్రి అంతా కలిపి ఇరవై ఒకటి ఉంటాయి. అవన్నీ పూజలో ఉపయోగించడానికి ఒకవిధంగా వర్షాకాలమే కారణం.