RRR Movie:జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సందడితో తిరునాళ్ల వాతావరణం నెలకొంది .అభిమానులంతా గురువారం అర్థరాత్రినుంచే సినిమాహాళ్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం నుంచి బెనిఫిట్ షోలు ప్రారంభంకావడంతో అభిమానుల కేరింతలుకొట్టారు. థియేటర్ల వద్ద హీరోల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. డీజేలు పెట్టి పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ అభిమానాన్నిచాటుకున్నారు . సినిమాకి మంచి టాక్ రావడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
Fans Halchal : గుంటూరు నగరంలోని థియేటర్లు వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ కటౌట్‌లకో పాలాభిషేకం చేసి హారతులుఇచ్చారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. దుగ్గిరాలలో సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులకు మరో సిలిండర్ తీసుకోవడానికి అనుమతించటంతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో చాలామంది అదనపు సిలెండర్ తీసుకున్నారు.
అభిమానులు భారీగా ర్యాలీ: కృష్ణా జిల్లా నందిగామలో భారీ కేక్‌ను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం అభిమానులతో కలిసి సినిమా చూశారు. జగ్గయ్యపేట, ఉయ్యూరు, పెనుగంచిప్రోలులో ఎన్టీఆర్ అభిమానులు భారీగా ర్యాలీ నిర్వహించారు.విజయవాడ, కైకలూరులో థియటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బెనిఫిట్ షోలకు భారీగా అభిమానులు తరలివచ్చారు. డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కేకు కోశారు.
రాయలసీమలో సందడే సందడి: రాయలసీమ వ్యాప్తంగానూ మెగా, నందమూరి అభిమానులు సందడి చేశారు. అనంతపురంలోని థియేటర్లలో ఉదయం ఐదు గంటలకే బెనిఫిట్స్ షోలను ప్రదర్శించారు.రాత్రి నుంచి అభిమాన హీరోలకు పాలాభిషేకాలు చేసి భారీ గజమాలతో అలంకరించారు. అదే సమయంలో ఓ అభిమాని ఎస్వీ థియేటర్ లో సినిమా చూస్తూ కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. మృతుడు అనంతపురంలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన ఓబులేసుగా గుర్తించారు. .కడప నగరంలోని ఏడు థియేటర్లలో సినిమా విడుదలవగా .. సాయిబాబా థియేటర్ వద్ద అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.