అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 117జీవో వల్ల పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది ప్రాథమిక స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో.నెంబర్ 117ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ కడప డీఈవో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. విలీనం పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందంటూ..అనంతపురంలో ఉపాధ్యాయ నేతలు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. 117 జీవో వల్ల..పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల ఆందోళన నిర్వహించారు.