Agitation on new districts: జిల్లాల విభజనపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ నిరసనలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు నల్లచీరలు ధరించి రిలే దీక్ష చేపట్టారు. మోకాళ్లపై కూర్చుని ఆందోళన నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ మాస్క్ ధరించిన వ్యక్తికి గులాబీ పువ్వులు అందించి నిరసన వ్యక్తంచేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ ఐ.పోలవరం మండలం పరిధిలో అన్ని పార్టీల నాయకులు నిరసన దీక్ష చేశారు. ఎదుర్లంక వారధి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ తెలుగుదేశం ఆధ్వర్యాన బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, మంత్రాలయం కలిపి ఆదోని కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలులో కాకుండా నంద్యాలలోనే కలపాలని కోరుతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. డోన్, నందికొట్కూరు నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలోనే ఉంచాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదిక కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయంగా విభజన జరగాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.