Tributes to NTR: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామరావు వర్ధంతి సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక... ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడన్నారు. వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులర్పించారు. తనకు ఎదురైన ప్రతి సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని నారా లోకేష్ అన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి.. ఇవే ఎన్టీఆర్ ఆయుధాలని కొనియాడారు.
NTR vardhanthi: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సినీనటుడు నందమూరి బాలకృష్ణ, లక్ష్మీపార్వతి, తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చరిత్ర మరువలేనిదని... ఆయన మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని బాలకృష్ణ అన్నారు.
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువతార మీరేనంటూ తాతను గుర్తుచేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్‌తోనేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి అచ్చెన్న ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. చల్లపల్లిలోని ఎన్టీఆర్ పార్కులో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో.. ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మచిలీపట్నంలో అన్నదానం చేపట్టగా... గన్నవరంలో చీరల పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో.. తెలుగుదేశం నేతలు.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.