ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Health Commissioner On Omicron: 'ఒమిక్రాన్​ బాధితుల్లో స్వల్ప లక్షణాలే.. అందోళన అక్కర్లేదు' - ap Health commissioner

Health commissioner bhaskar on omicron: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని.. సాధారణ చికిత్సతో ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ భాస్కర్‌ వెల్లడించారు. ఇప్పటిదాకా 17 మంది బాధితుల్లో ఎవరూ ఆస్పత్రిలో చేరలేదని స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ తరపున అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ap Health commissioner bhaskar on omicron
ap Health commissioner bhaskar on omicron

By

Published : Jan 1, 2022, 6:38 AM IST

State health Commissioner Bhaskar On Omicron effect in AP: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని, సాధారణ కరోనా చికిత్సతో ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని వెల్లడించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటివరకు 17 మంది ఒమిక్రాన్‌ బారిన పడినట్లు చెప్పారు. వీరిలో ఎవరూ ఆస్పత్రిలో చేరలేదన్నారు. ప్రస్తుతమున్న బాధితులు, దేశవ్యాప్తంగా అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని తెలిపారు.

కేసుల నమోదుకు తగ్గట్లు వైద్య, ఆరోగ్య శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధితులకు త్వరగా చికిత్స అందించేందుకు ఆసుపత్రులను సిద్ధం చేశామని, ఆక్సిజన్‌ కూడా అవసరాలకు తగ్గట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15-18 ఏళ్ల మధ్యన ఉన్న వారికి తొలి డోసు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

స్వల్పంగా గొంతునొప్పి, ముక్కు నుంచి నీరు
ఒమిక్రాన్‌ బాధితులకు స్వల్పంగా గొంతునొప్పి, ముక్కు నుంచి నీరు మాత్రమే వస్తోంది. జ్వరం కూడా రాలేదు. దీనివల్ల బాధితులు వైరస్‌ బారినపడినట్లు తెలుసుకోలేకపోతున్నారు. కొవిడ్‌ బాధితులకు అందించే మందులు, చికిత్సతోనే కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక చికిత్స అవసరం రాలేదు. ఒమిక్రాన్‌తో బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు చాలా తక్కువ. అయితే దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా బాధితుల ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం రావచ్చు. ప్రాణనష్టం కూడా చాలా తక్కువ. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. కనుక మాస్కులు ధరించడం, కనీస భౌతిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. అవసరాలకు తగ్గట్లుగా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది ఉన్నారు. ప్రత్యేక నియామకాలు కూడా చేపట్టాం.

ఫిబ్రవరి నెలాఖరుకు 2 డోసుల పంపిణీ దాదాపు పూర్తి
రాష్ట్రంలో ఫిబ్రవరి చివరి నాటికి 18 ఏళ్లు దాటిన వారిలో 95 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తవుతుంది. 13 జిల్లాల్లోనూ తొలి డోసు పంపిణీ వంద శాతం పూర్తయింది. రెండో డోసు 73 శాతం వరకు పూర్తయింది. వీరికి రెండో డోసుకు ఇంకా సమయం ఉంది.

నెల రోజుల్లోగా బాలబాలికలకు రెండు డోసులు
15-18 ఏళ్ల మధ్యన ఉన్న బాలబాలికలకు జనవరి 3 నుంచి 7 వరకు తొలి డోసు టీకా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. గ్రామ/వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ పంపిణీ జరుగుతుంది. 15-18 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 24 లక్షల మంది బాలబాలికలకు తొలి డోసు కింద కొవాగ్జిన్‌ ఇస్తాం. తొలి డోసు పొందిన తేదీ నుంచి 28 రోజులకు రెండో డోసు అందిస్తాం. కొవిన్‌ యాప్‌ లేదా పోర్టల్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లేదా నేరుగా కూడా సచివాలయాలకు వెళ్లి వ్యాక్సిన్‌ పొందవచ్చు. ఏడో తేదీ తర్వాత స్థానిక పరిస్థితుల ఆధారంగా బాలబాలికలు చదివే విద్యాసంస్థల్లోనూ టీకాల పంపిణీకి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారు.

4చోట్ల జీనోమ్‌ సీక్వెన్స్‌ కేంద్రాలు
హైదరాబాద్‌లోని సీసీఎంబీ సహకారంతో విజయవాడలోని ప్రభుత్వ సిద్దార్థ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో జన్యుక్రమ నిర్ధారణ (జీనోమ్‌ సీక్వెన్స్‌) పరీక్షలు మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభమవుతాయి. ఐసీఎంఆర్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో జీనోమ్‌ సీక్వెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. తిరుపతి స్విమ్స్‌లోనూ ఇందుకు అవసరమైన యంత్రాలున్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విశాఖలోనూ కేంద్రం ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయించాం. ఒక్కో జీనోమ్‌ సీక్వెన్స్‌ పరీక్షకు రూ.5వేలు ఖర్చవుతుంది. మ్యుటేషన్‌ ప్రారంభంలో అది ఏ ఉత్పరివర్తనమో తెలుసుకునేందుకు ఈ పరీక్ష అవసరమవుతుంది. కేసులు పెరిగేకొద్దీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష సరిపోతుంది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షా కేంద్రాలనూ గతంలో కంటే పెంచాం.

బూస్టర్‌ కింద అదే వ్యాక్సిన్‌
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు (పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు) రెండో డోసు పొంది తొమ్మిది నెలలు దాటింది. వీరికి జనవరి 10 నుంచి 15 మధ్య బూస్టర్‌ డోసు ఇస్తాం. దీర్ఘకాలిక వ్యాధులుండి, 60 ఏళ్లు దాటినవారు మూడో డోసు పొందవచ్చు. అయితే రెండు డోసులు పొంది 9 నెలలు పూర్తికావాలి. ఇంతకు ముందు ఏ వ్యాక్సిన్‌ పొందారో అదే వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసుగా ఇస్తాం. బూస్టర్‌ డోసు పొందేందుకు కొవిన్‌ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. లేదా నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి టీకా పొందవచ్చు. టీకా తీసుకున్నా ఒమిక్రాన్‌ బారినపడే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్‌ పొందినవారికి ఒమిక్రాన్‌ వంటి మ్యుటేషన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అనారోగ్య తీవ్రత తగ్గుతుంది.

ఇదీ చదవండి...

New pension: నేటి నుంచి పెంచిన పింఛన్ పంపిణీ.. ప్రత్తిపాడులో పారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details