PRC: పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అసోయేషన్ ధ్వజమెత్తింది. ఉద్యోగ సంఘాల ఐకాస నుంచి బయటకు వచ్చి.. ఉద్యోగుల సర్వీసు అసోషియేషన్గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు వెల్లడించారు.
ఉద్యోగుల హక్కులను కాపాడాలనే ఉద్దేశం నుంచే తమ అసోషియేషన్ పుట్టిందన్నారు. పలు కీలక డిమాండ్ల సాధనలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఏ మాత్రం ఒత్తిడి తీసుకురాలేక పోయారని ఆయన విమర్శించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ప్రధాన సంఘాలు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో భరోసా కల్పించలేకపోయారన్నారు. ఉద్యోగుల్లో భరోసా కల్పించలేని ఉద్యోగ సంఘాల నేతలు క్షమాపనలు చెప్పి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం పీఆర్సీ రిపోర్టు లేకుండా చర్చలకు వెళ్లి.. 23 శాతం ఫిట్మెంట్కు ఒప్పుకోవటం దారుణమన్నారు. ఐఆర్ కంటే ఎక్కువ సాధించాల్సిన పీఆర్సీని 23 శాతానికే పరిమితం చేయటం ఆక్షేపణీయమన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముందు చెప్పినట్లుగా అక్టోబర్ 1 నుంచి సర్వీసులను క్రమబద్దీకరించాలని రాజారావు డిమాండ్ చేశారు.