ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుణాలు, ఓడీలపై బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలత - రాష్ట్ర ఆర్థికశాఖ

నిధుల వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తేవడంతో.. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. కేంద్ర నిధుల ఆధారంగా రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌లు పొందాలనుకున్న ప్రభుత్వానికి బ్యాంకులు ససేమిరా అన్నాయి. ఫలితంగా ఆర్థికశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు.

debts
debts

By

Published : Aug 13, 2021, 5:55 AM IST

Updated : Aug 13, 2021, 7:42 AM IST

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను ఇష్టారీతిన ఖర్చు చేయకుండా కట్టడి చేయడంతో రాష్ట్రం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టగా బ్యాంకుల నుంచి తిరస్కారం ఎదురైంది. కేంద్ర నిధుల ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌లను పొందాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఈ ఎత్తుగడకు సానుకూల ఫలితాలు రాలేదు. దీంతో ఆర్థికశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు.సాధారణంగా ఆర్థిక నిర్వహణలో అనేక మార్గాలను అనుసరిస్తారు. నిధులెలా వచ్చినా తొలుత అవసరాలను తీర్చుకుని తర్వాత సర్దుబాట్లు చేసుకుంటారు. అనేక ఏళ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కేంద్రం ఇస్తుంటే వాటిని పీడీ ఖాతాలకు మళ్లించి ఇతర అవసరాలకు వినియోగించుకుని, తర్వాత సర్దుబాటు చేయడం చాలా రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు ఆ నిధుల వినియోగ నిబంధనలు మారాయి.

ఈ ఏడాది జులై ఒకటి నుంచి కొత్త నిబంధనల అమలుకు సమ్మతి తెలియజేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు కేంద్ర నిధులను నేరుగా ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం లేకపోవడంతో.. రాష్ట్రం కొత్త ఎత్తుగడ వేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను బ్యాంకులో జమ చేయాల్సి ఉన్నందున ఆ నిల్వల మొత్తానికి సమంగా రుణాలు తీసుకోవడంగానీ, ఓవర్‌డ్రాఫ్ట్‌కుగానీ వెళ్లాలని యోచించింది. ఈ ప్రతిపాదనకు బ్యాంకుల నుంచి సానుకూల స్పందన రాకపోగా, అవి కూడా కట్టడి చేశాయి.

బ్యాంకుల ఖాతాలకు నిధులు..

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాష్ట్రాల ఖాతాలకు చేరిన 21 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు బదలాయించాలి. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటా నిధులను ఆ ఖాతాల్లో వేయాలి. ఒక పథకం నిధులన్నీ ఒకే బ్యాంకులో ఉండాలని, వాటి వినియోగం, ఖర్చుపై మ్యాపింగ్‌ చేయాలని కేంద్రం నిర్దేశించింది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అవసరాల విషయంలో ఇబ్బందులు రానున్నాయి.

బ్యాంకర్లతో సమావేశం..

ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు గతంలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర వాటా నిధులను ఆ బ్యాంకుల్లో జమ చేస్తున్నందున తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలను కోరారు. లేదంటే ఓవర్‌డ్రాఫ్ట్‌ అయినా ఇవ్వాలని కొన్ని బ్యాంకులకు లేఖలు పంపారు. ఇందుకు సానుకూలంగా ఉన్న బ్యాంకులవద్దే ఆయా నిధులను జమ చేసే ఆలోచనతో ఈ ప్రతిపాదన తెచ్చారు. కానీ, ఓవర్‌డ్రాఫ్ట్‌ కోసం ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా అని, వీటికి చెల్లింపుల మాటేమిటని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు అదనపు ఆదాయ మార్గాలున్నాయా.. ఉంటే ఆ విషయం తెలియజేశాక రుణాలు, ఓడీ అంశం పరిశీలించవచ్చని అంటున్నాయి.

ఇదీ చదవండి:

RRR: శాసనసభలో ఫిరాయింపులపై ఏం చర్యలు తీసుకుంటారు?: ఎంపీ రఘురామ

Last Updated : Aug 13, 2021, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details