ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు...వివిధ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

పలు పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేతలతో చర్చించి...అభిప్రాయాలు తీసుకోనున్నారు. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతుంటే...స్థానిక సంస్థలకు కొత్త షెడ్యూలును ప్రకటించాల్సిందిగా మరికొన్ని పార్టీలు తమ వాదన వినిపించే అవకాశమున్నట్లు సమాచారం.

పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం
పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

By

Published : Oct 27, 2020, 6:54 PM IST

Updated : Oct 28, 2020, 12:42 AM IST

కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో భేటీ నిర్వహించనుంది. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేర్వేరుగా సమావేశం కానున్నారు. వారి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కొనసాగింపు అంశంపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈసారి రాతపూర్వకంగానూ అభిప్రాయాలను సమర్పించాల్సిందిగా ఎస్ఈసీ రాజకీయ పార్టీలను కోరింది. వారితో సమావేశం అయ్యేందుకు ఒక్కో పార్టీకీ విడివిడిగా సమయాన్ని కేటాయించారు. తెదేపా తరఫున అచ్చెన్నాయుడు, భాజపా నుంచి పాక సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, సీపీఎం నుంచి వెంకటేశ్వర్లు, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరు కానున్నారు.

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా అధికారికంగానే సమాచారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మంత్రులు గౌతమ్ రెడ్డి, కొడాలి నాని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయటంతో అధికార వైకాపా పార్టీ ఈ అంశాన్నే ఎస్ఈసీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే పాత షెడ్యూలును కొనసాగించకుండా...కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఈసీ భేటీలో ఇదే అభిప్రాయాన్ని తెదేపా, వామపక్షాలు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం.

ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును ఎస్ఈసీ ప్రకటించింది. మొత్తం 660 జడ్పీటీసీలు, 9,984 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికల నిర్వహించాలని షెడ్యూలు విడుదల అయ్యింది. 104 మున్సిపాలటీలకు గానూ.. 75 మున్సిపాలటీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. 16 కార్పొరేషన్లకు గానూ.. 12 కార్పొరేషన్లల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా కారణంగా మార్చి 15న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వాయిదా వేసే నాటికి 2,129 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.

జాతీయ, స్థానిక పార్టీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 19 రాజకీయ పక్షాలు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమావేశం కానున్నాయి. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ పార్టీలతో పాటు, స్థానిక పార్టీలైన తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, జనసేన, ఇతర రాష్ట్రాలకు చెందిన జేడీయూ, జేడీఎస్, మజ్లీస్, ఫార్వార్డ్ బ్లాక్, సమాజ్ వాదీ పార్టీ, ఏఐఏడిఎంకే తదితర పార్టీల ప్రతినిధులు ఎస్​ఈసీ ముందు హాజరు కానున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఒక్కొక్కరికి 10 నిమిషాల చొప్పున ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఎస్​ఈసీ ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కాకూడదని వైకాపా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ప్రకటన జారీ చేసింది.

ఇదీచదవండి

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల

Last Updated : Oct 28, 2020, 12:42 AM IST

ABOUT THE AUTHOR

...view details