SOMU VEERRAJU LETTER TO CM JAGAN: కేంద్ర ప్రభుత్వ.. సర్వశిక్షా అభియాన్ పథకంలో భాగంగా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందించడంలో కనీస పర్యవేక్షణ నిర్వహించలేకపోతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. కుళ్లిపోయిన గుడ్లను తిని పాఠశాల విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నా- బాధ్యులపై చర్యలు తీసుకోలేకపోయిందని ధ్వజమెత్తింది. మంచి గుడ్లను అందించలేని రాష్ట్ర ప్రభుత్వం.. గుడ్ గవర్నెన్స్ ఎలా ఇవ్వగలదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి పేరుకుపోతుందని సోము వీర్రాజు దుయ్యబట్టారు. పాఠశాలలకే నిత్యం 50 లక్షల కోడిగుడ్లు సరఫరా చేయాలని... ఇవి కాకుండా బాలింతలు, హాస్టల్ విద్యార్ధులు, కస్తూరీబా పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే పౌష్టికాహారం మాటేంటని నిలదీశారు. ఎగుమతులకు పనికి రాని గుడ్లను ఏజెన్సీలు సేకరించి నిబంధనలకు విరుద్ధంగా వాటిని పంపిణీ చేస్తున్నారంటూ.. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు.
ఫిర్యాదులు వస్తున్నా.. ప్రభుత్వ పర్యవేక్షణ శూన్యం
Students became ill health after had midday meals: శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని బాలేరు ప్రాథమిక పాఠశాలలో కోడిగుడ్లు తిని 95 మందికి అస్వస్థతకు గురైనా.. గుడ్లు సరఫరా చేసిన వారిపై ఏం చర్య తీసుకున్నారని ప్రశ్చించారు. విజయవాడ వాంబే కాలనీలోని నగర పాలక సంస్థ పాఠశాలలో కోడిగుడ్డు ఉడక బెట్టిన తరువాత రంగుమారుతోందని ఫిర్యాదులు వస్తున్నా.. అధికారుల నుంచి స్పందన లేదని మండిపడ్డారు. పలు జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు అనేకం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలు ఉండటంలేదన్నారు. ఒక్కో ఏజెన్సీ నుంచి 30 -40 వేల గుడ్లను 10 రోజులకు ఒక పర్యాయం ఇవ్వడం వల్ల కూడా సమస్యలు వస్తున్నా.. ప్రభుత్వ పర్యవేక్షణ శూన్యమని విమర్శించారు.