Yadadri Temple Reopening : దివ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం స్వామి వారి ఆలయంలో ఆరేళ్ల తర్వాత స్వయంభూల దర్శనభాగ్యం కలిగింది. ఉద్ఘాటన క్రతువులో భాగంగా పాంచారత్ర ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వైభవోపేతంగా మహకుంభసంప్రోక్షణ జరిగింది. ఇందుకు స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన ఈ నెల 21న అంకురార్పణ చేసి.. బాలాలయంలో సప్తాహ్నిక దీక్షా పంచకుండాత్మక యాగం నిర్వహించారు. ఈరోజు(మార్చి 28) ఉదయం స్వామి వారి నిత్య కైంకర్యాల అనంతరం.. ఉద్ఘాటనకు సంబంధిత క్రతువులను ప్రారంభించారు.
7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ
యాదాద్రిలో కేసీఆర్..:యాదాద్రి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. హెలికాఫ్టర్‌లో నేరుగా యాదాద్రి చేరుకున్న ఆయన.. ఆలయంపై విహంగ వీక్షణం చేశారు. పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం.. బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర వైభవంగా సాగింది. సీఎం కేసీఆర్ మడి వస్త్రాలు ధరించి.. నేరుగా వచ్చి సతీసమేతంగా శోభయాత్రలో పాల్గొన్నారు.
బాలాలయం నుంచి బయలుదేరిన శోభాయాత్ర
వైభవంగా శోభాయాత్ర...:స్వామివారి శోభాాయాత్రలోమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అర్చకులు, వేద పండితులు పెద్దఎత్తున శోభాయాత్రలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వామివారి పల్లకిని తలా కాసేపు మోశారు. ఆరేళ్ల తర్వాత స్వామివారు బాలాలయం నుంచి మంగళవాద్యాలు, మహిళల కోలాటాల నడుమ.. ప్రధానాలయంలోకి ప్రవేశించారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారు ప్రవేశించారు. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ఉత్సవమూర్తుల ప్రదక్షిణలు నిర్వహించారు.
సతీసమేతంగా కొండపైకి చేరుకున్న సీఎం కేసీఆర్
ఏకకాలంలో ఏడు గోపురాలపై..:యాదాద్రిలో నేత్రపర్వంగా మహాసంప్రోక్షణ పర్వం పూర్తైంది.ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఏడు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు.. కుంభాభిషేకం, సంప్రోక్షణ గావించారు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ నిర్వహించారు.
దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ
సంప్రోక్షణలో సతీసమేతంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సంప్రోక్షణలో మంత్రి జగదీశ్ రెడ్డి కుటుంబం