ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెత్తకుప్పలో స్టాంప్ పేపర్లు.. ఎక్కడివి? - stamp papers at dustbin in krishna district

Stamp Papers at Dustbin: రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే స్టాంప్ పేపర్లు పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద చెత్తకుప్పలో దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీటిని పటమటలో జిరాక్స్‌ సెంటర్‌ నడిపే లైసెన్స్‌డ్‌ స్టాంప్‌ వెండర్‌ సందాటి శ్రీనివాసరావుకు చెందినవిగా గుర్తించారు. అక్టోబర్‌ 1, 2021న సీఎఫ్‌ఎంఎస్‌ చలానాలో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన వద్ద నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ నందేశ్వరరావు రూ.2,43,650 విలువ చేసే స్టాంపులను సీజ్‌ చేశారని వివరాలు వెల్లడించారు.

Stamp Papers at Dustbin
చెత్తకుప్పలో స్టాంప్ పేపర్లు

By

Published : Mar 25, 2022, 9:25 AM IST

stamp Papers at Dustbin: విజయవాడలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద చెత్తకుప్పలో స్టాంప్‌ పేపర్లు దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవి పటమటలో జిరాక్స్‌ సెంటర్‌ నడిపే లైసెన్స్‌డ్‌ స్టాంప్‌ వెండర్‌ సందాటి శ్రీనివాసరావుకు చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనపై గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గతేడాది జూన్‌లో రూ.95,000 ప్రభుత్వానికి సి.ఎఫ్‌.ఎం.ఎస్‌. ద్వారా చలానా చెల్లించి పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి శ్రీనివాసరావు స్టాంప్‌ పేపర్లు తీసుకున్నారు. తర్వాత అక్టోబర్‌ 1, 2021న సీఎఫ్‌ఎంఎస్‌ చలానాలో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన వద్ద నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ నందేశ్వరరావు రూ.2,43,650 విలువ చేసే స్టాంపులను సీజ్‌ చేశారు. లైసెన్స్‌ కూడా రద్దు చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం ఏమిటని బాధితుడు ప్రశ్నించగా జిల్లా రిజిస్ట్రార్‌ జయలక్ష్మిని సంప్రదించాలని సూచించారు. మరుసటి రోజు చలానా రసీదు తీసుకుని ఆమెను సంప్రదించగా దీనిపై విచారణకు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్‌ నందేశ్వరరావు వివరాలు సేకరించి, చలానా ట్యాంపరింగ్‌ జరగలేదని, అదే నెల 15న జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదిక అందించారు. తనకు చెందిన స్టాంపు పేపర్లు ఇవ్వాల్సిందిగా కోరగా స్టాంపులు ఎక్కువ, తక్కువ ఉన్నాయని మరో నోటీసు ఇచ్చి మానసికంగా వేధించారని శ్రీనివాసరావు వాపోయారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి రూ.50వేలు ఇస్తే స్టాంపు పేపర్లు తిరిగిస్తానని, లైసెన్స్‌ కూడా పునరుద్ధరిస్తానని చెప్పాడని ఆరోపించారు. సీజ్‌ చేసిన స్టాంపు పేపర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, ఏ నేరం చేయకుండానే లైసెన్స్‌ను రద్దు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని చెత్తకుప్పలో పడేశారని చెప్పారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సబ్‌ రిజిస్ట్రారు ప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా, ఆ సంఘటన జరిగినప్పుడు తాను ఇక్కడ లేనని, తనకు సంబంధం లేదన్నారు. జిల్లా రిజిస్ట్రారుని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఆమె సెలవులో ఉండడంతో అందుబాటులోకి రాలేదు.

ఇదీ చదవండి: అమ్మానాన్నలు కలగన్నారు.. అమ్మాయిలు గెలిచి చూపించారు..!

ABOUT THE AUTHOR

...view details