విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బందర్ రోడ్డులో సాగునీటి కాల్వ.. ఆక్రమణలకు గురవుతోంది. కంకిపాడు మండలంలో సుమారు రెండున్నర వేల ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల సాగు భూములకు నీరందించే పంట కాల్వ కుచించుకుపోతోంది. మచిలీపట్నం రహదారికి ఆనుకొని ఉన్న కోలవెన్ను ఛానల్‌కు సమీపంలో వెంచర్లు వేస్తోన్న స్థిరాస్తి వ్యాపారులు కాల్వ వెడల్పును తగ్గించేస్తున్నారు. 53 అడుగుల వెడల్పు ఉన్న ఈ కాల్వను 50 అడుగుల మేర కిలో మీటర్ పొడవున ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ పనులు జరుగుతున్నా అధికార యంత్రాంగం ఎవరూ అటువైపుగా కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వారి ప్రయోజనం కోసమే..
పెనమలూరు - కంకిపాడు మండలాల మధ్య విజయవాడ ప్రధాన రహదారిని అనుకొని ఈ కోలవెన్ను ఛానల్ ఉంది. దీని ద్వారా కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఈడుపుగల్లు, గొల్లగూడెం గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరందుతోంది. ఇటీవల ఈ ఛానల్‌ను ఆనుకొని స్థిరాస్తి వ్యాపారులు భూములు కొనుగోలు చేశారు. వెంచర్ పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడంతో ఈ ఛానల్ ఆక్రమణను సులువైన మార్గంగా మలచుకున్నారు. చుట్టుపక్కల రైతులకు తాము పక్కా రహదారి వేస్తున్నామంటూ వారితో సంప్రదింపులు జరిపారు.
కాల్వకు సిమెంట్‌లైనింగ్ చేయిస్తామని.. దానివల్ల నీరు ఏ మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తుందని.. పొలాల్లోని పంట ఉత్పత్తిని మార్కెట్‌కు తరలించేందుకు అనువుగా ఉండడమే కాకుండా భూమి విలువ పెరుగుతుందంటూ కొందరు రైతులను ఒప్పించారు. తమ ప్రణాళిక ప్రకారం యంత్రాల సాయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. ఇదే సమయంలో కాల్వ సిమెంట్‌లైనింగ్ పనులూ చకచకా చేయించేస్తున్నారు. రైతుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఈటీవీ భారత్ బృందాన్ని- స్థిరాస్తి సంస్థ ప్రతినిధులు నిలువరించారు. తాము చేస్తోన్న ఈ పని పూర్తిగా రైతుల లబ్ధి కోసమేనని తెలిపారు. కోటి రూపాయల వరకు ఖర్చు చేసి ఈ పనులు జరుపుతున్నామని తెలిపారు.
సాగు నీరు సమయానికి అందేనా?