RTC: ఆర్టీసీలో ఉన్న 11 వేల 439 బస్సుల్లో సంస్థ సొంత బస్సులు 9వేల 89 కాగా.. మిగిలిన 2వేల299 అద్దె బస్సులే. గతంలో అద్దె బస్సులు కన్నా.. సొంత బస్సులకే ప్రాధాన్యత ఉండేది. కానీ క్రమంగా అద్దె బస్సుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 10 లక్షల కిలోమీటర్లు కంటే ఎక్కువ తిరిగిన బస్సులు.. ప్రయాణికుల తరలింపునకు పనికిరావు. డొక్కు బస్సులను పక్కన పెట్టి వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉంది. గతంలో ఏటా 2 వేల కొత్త బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించేది. అనేక రూట్లలో కొత్త బస్సులు రావడం వల్ల బస్సు ప్రయాణానికి జనం ఆసక్తి కనపరిచేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో మూడేళ్లుగా కొత్త బస్సుల ఊసేలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్న బస్సులకే కొత్తగా రంగులద్ది ఆర్టీసీ తిప్పుతోంది.
ఆర్టీసీలో 10 లక్షల కిలోమీటర్లు చేరువైన పల్లె వెలుగు బస్సులు 4 వేలపైనే ఉన్నాయి. వీటిని మరికొద్ది రోజుల్లో పక్కన పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ బస్సులకే ఇంజిన్లు మరమ్మతులు చేసి బాడీలు మార్చుతూ కొత్త బస్సులుగా మార్చుతున్నారు. దీని కోసం ఒక్కో బస్సుకు 2 లక్షల వరకు వెచ్చించి రోడ్డెక్కిస్తున్నారు. వాటి కాలపరిమితి దాటడంతో బ్రేకులు, ఇంజిన్ ఫెయిలై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదనేది అధికారుల మాట.