ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రతకు కేరాఫ్.. విజయవాడ బస్టాండ్!

అది ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్. కొన్నేళ్ల క్రితం వరకు ఆ బస్టాండ్ పరిస్ధితే వేరు. చీకటి పడితే చాలు పరిసర ప్రాంతాలు అరాచకాలకు అడ్డాగా మారేవి. ఆకతాయిలు, పోకిరీలు, బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్​లు బస్టాపులో తిష్ట వేసేవి. దీంతో ప్రయాణికులు, పరిసర ప్రాంతాల్లో తిరిగేందుకు జనాలు జంకేవారు. నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మార్పు కనిపిస్తోంది. బస్టాండ్, పరిసర ప్రాంతాలను నిఘా కెమెరాలు నిరంతరం కాపలా కాస్తున్నాయి. పోలీసు కళ్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. బస్టాండ్​ను పూర్తిగా ఆధునీకరించటంతో రూపురేఖలు మారిపోయాయి. బస్సులకు, ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించడమే కాకుండా ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో పోలీసులు వచ్చేలా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.

vijayawada bus stand
విజయవాడ బస్టాండ్

By

Published : Nov 25, 2020, 2:11 PM IST

రాష్ట్రంలో అతి పెద్దదైన బస్టాండ్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్​స్టేషన్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న ఇక్కడి నుంచి నిరంతరం పలు రాకపోకలు సాగుతుంటాయి. నిత్యం 3 వేల బస్సులు నడుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పట్టణాలకు నిరంతరం బస్సులు తిరుగుతాయి. తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక, సహా ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలు, జిల్లాలకు ప్రయాణికులు వెళ్లివస్తుంటారు. రోజుకు లక్షమందికి పైగా ప్రయాణం చేస్తుంటారు.

ఆధునికీకరణ

లాక్​డౌన్​తో 2 నెలలపాటు వెలవెలబోయిన బస్టాండ్.. ఇన్నాళ్లకు​ మళ్లీ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. బస్టాండ్​లో 72 ప్లాట్ ఫాంలు ఉండగా.. వాటన్నింటినీ సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చారు. రాజధాని పరిధిలో ఉన్నందున 2016లోనే బస్టాండ్​ను పూర్తిగా ఆధునీకరించి నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల వీటి సంఖ్య మరింత పెంచారు. ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు... బస్సు ఎక్కేవారు, దిగేవారు, ప్లాట్ ఫాంపై వేచి ఉండే వారందరినీ నిరంతరం చిత్రీకరించేలా బస్టాండ్​లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ అనుసంధానించి కొన్నింటిని పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు.. మరికొన్ని స్థానిక కంట్రోల్ రూంకు అనుసంధానించారు. పార్కింగ్ ఏరియాలోనూ కెమెరాలు అమర్చి.. పరిస్థితులను పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు.

ఎక్కడికక్కడ కెమెరాలు.. పటిష్ఠ నిఘా

బస్టాండ్​లో గతంలో దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. బస్ స్టేషన్ పరిసరాల్లో బ్లేడ్ బ్యాచ్​లు, పోకిరీలు ఉంటూ వచ్చి పోయేవారిపై దాడులకు దిగేవారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రస్తుతం బస్టాండ్ ప్రాంగణంలో వీరి బెడద పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు చెప్తున్నారు. గతంలో రోజూ ఏదో ఒక కేసు పోలీసు స్టేషన్​లో నమోదయ్యేది. ప్రస్తుతం చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినా సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పోలీసులు త్వరగా పట్టుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల్లో భరోసా కలిగింది. ఇటీవల సెల్​ఫోన్లు పోతున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

బస్టాండ్ భవనంపై పలు ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను గతంలో నిర్మించారు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం, ఏసీబీ, రవాణాశాఖ, విజిలెన్స్, పలు విభాగ అధిపతులు కార్యాలయాలు ఇక్కడున్నాయి. వీరు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా, భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గతంలో చీకటి పడితే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంచరించేదుకు వెనుకాడిన ప్రయాణికులు.. ఇప్పుడు ధైర్యంగా రాకపోకలు సాగిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఛిద్రమవుతున్న మత్స్యకారుల బతుకులు.. ఆదుకోవాలని వేడుకోలు

ABOUT THE AUTHOR

...view details