దేశంలోని అత్యంత పొడవైన నదుల్లో కృష్ణానది ఒకటి. నీటి ప్రవాహం పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద నది. నదీతీరం వెంట ఏర్పడిన ఆవాసాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వేల గ్యాలన్ల మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్త కలవటంతో ఆ నది కలుషితమవుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల అలక్ష్యం కృష్ణమ్మ పాలిట శాపంగా మారింది.
ప్రజలు విడుదల చేసే చెత్తాచెదారంతోపాటు... కొన్నిచోట్ల పరిశ్రమల నుంచి కలుషిత నీరు కృష్ణమ్మలో కలుస్తోంది. అధికారులు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేయటం కృష్ణమ్మ అనారోగ్యానికి కారణమవుతోంది. విజయవాడలోని డ్రైనేజీ నీరు పెద్దమొత్తంలో కృష్ణా నదిలోనే కలుస్తోంది. బందరు కాలువ, రైవస్ కాలువల్లోకి నగరంలోని అవుట్‌ఫాల్ డ్రైయిన్లు కలిపి ఉన్నాయి. దాదాపు 29 డ్రైయిన్లు పంట కాలువకు కలిసుండడంతో మురుగుకాలువల్లా మారిపోయాయి. తరచూ కురిసే భారీ వర్షాలకు డ్రైయిన్లు పొంగి చివరకు కృష్ణా ఒడికే చేరుకోక తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో నదీ స్వచ్ఛత ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.