ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kathanilayam: కారా మాస్టారు 'కథానిలయం'పై ప్రత్యేక కథనం - కాళీపట్నం రామారావు తాజా సమాచారం

తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం. విభిన్న కథల సమాహారం. సిక్కోలు కేంద్రంగా విరాజిల్లుతున్న కథా భాండాగారం.. కథానిలయం. వేల పుస్తకాల సేకరణ, వాటి డిజిటలీకరణ వంటి కార్యాలను తలకెత్తుకుని ప్రవాసాంధ్రుల జేజేలు అందుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు మానసపుత్రిగా పేరొందింది. ఆయన స్వర్గస్థులైన సందర్భంగా.. కథానిలయం అంచలంచెల ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

katha nilayam
కథానిలయం

By

Published : Jun 4, 2021, 5:46 PM IST

చెల్లాచెదురుగా ఉన్న కథా సాహిత్యాన్ని ఒకే చోట చేర్చే యజ్ఞంలో ఓ కథాతపప్వి సాహితీ సేవకు ప్రతిరూపంగా కథానిలయం ఏర్పడింది. కథల కాణాచి కారా మాష్టారు మానసపుత్రిగా.... ఎక్కడెక్కడో విచ్చుకున్న కథా పుష్పాలన్నింటినీ సేకరిస్తూ 'కథా నిలయం' అన్న పేరుకే సార్థకత చేకూరుస్తూ ముందుకు సాగుతోంది. కేవలం సంపుటాలు, సంకలనాలు, పత్రికల్లోనే లభ్యమయ్యే తెలుగుకథను విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానలకు అందించడమెలా అన్న ఆలోచన.. కారా మాష్టారిని తొలిచేసేది. కథానిలయం ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. బహుశా మాష్టారి సంకల్ప బలం కావొచ్చు.. కథలకు చిరునామాగా, కథకులకు వరంగా, ఔత్సాహికులకు అధ్యయన కేంద్రంగా భాసిల్లుతోంది.

గురజాడవారి నాటి కథానికల నుంచి, నేటి తరం ఆధునిక రచనల వరకూ అన్నింటినీ ఒక గూటి కిందకు తీసుకొచ్చి భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో.. 1997 ఫిబ్రవరి 22న కథా నిలయం ప్రారంభమైంది. నాటి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వృద్ధి చెందింది. శ్రీకాకుళంలోని విశాఖ A కాలనీలో.. కారా మాష్టారి అవార్డులు, తన వ్యక్తిగత గ్రంథాలయంలోని 800 పుస్తకాలతో కథానిలయం ప్రారంభమైంది. నేడు పాతికవేల పుస్తకాలు, మరో పాతికవేల పత్రికా సంచికలు అక్కడ ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైబడిన ప్రయాణంలో.. ఎందరో ప్రసిద్ధ సాహిత్యకారుల ప్రసంగాలకూ కథానిలయం వేదికైంది. 2009 నుంచి డిజిటలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కథానిలయం డాట్‌ కామ్ పేరుతో వెబ్‌సైట్‌ సైతం పురుడు పోసుకుంది. 88వేల కథలకుపైగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

కథా సాహిత్యం, సంకలనాలు, సంపుటాలు, ఫీచర్లు, ఆత్మకథలు, జీవితచరిత్రలు.. ఇలా పుస్తకాలను వివిధ రకాలు వర్గీకరించి కథానిలయంలో అందుబాటులో ఉంచారు. ట్రస్ట్ సభ్యులే కాక ఎందరో పరోక్షంగానూ కథానిలయానికి తమవంతు సేవలందించారు. తమకు దొరికిన కథలను మాష్టారికి దూరప్రాంతాల నుంచి పంపిన అభిమానులెందరో. ప్రచురణకర్తలు, రచయితలు ఏ కొత్త పుస్తకం ముద్రించినా.. రెండు ప్రతులు కథానిలయానికి పంపుతుంటారు. ఈ విధంగా వర్తమాన సాహిత్యానికి కథానిలయం వేదికవుతోంది. 15వేల రచయితలు, 108 ప్రచురణ సంస్థల వివరాల సాయంతో విశిష్టమైన పరిశోధనా గ్రంథాలయంగా ఎదిగింది.

తన పురస్కారాలతో పాటు వచ్చిన నగదు ప్రోత్సాహాకాన్ని మూలధనంగా పెట్టి కథానిలయానికి కారా మాష్టారు పునాది వేశారు. అక్కడ దొరకని తెలుగుకథ అంటూ ఉండకూడదన్నది ఆయన ఆశయం. భవనం కింద అంతస్తులో ప్రధాన పుస్తక భాండాగారం. వెనుకవైపున అరుదైన పుస్తకాల బీరువాలు.. గురజాడ, కొకు, రావిశాస్త్రుల పెద్ద తైలవర్ణ చిత్రాలు. పై అంతస్తులో వంద మందికి సరిపడా సీటింగ్‌. ఆ హాలు నిండా గోడలపై ప్రముఖ రచయితల ఫొటోలు వేలాడదీశారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న కథానిలయ వార్షికోత్సవాలు..ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ శని, ఆదివారాల్లో జరుగుతాయి.

'ఈ కథానిలయం మనది' అనుకుంటూ తెలుగు ప్రజలే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మాష్టారు ఆకాంక్షించేవారు.

ఇదీ చదవండి

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details