కేసులను వేగంగా విచారణ చేసేందుకు కృష్ణాజిల్లా పోలీసులు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. "గెకో " పేరుతో నూతన ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు. ఈ గ్రేవ్ ఎకనామిక్ అండ్ సైబర్ అఫెన్స్ (గెకో) ట్రాకింగ్ సిస్టంతో త్వరగా కేసుల్లో ఛార్జ్‌షీట్ వేసే అవకాశముంటుందన్నారు సిద్ధార్ద్. దీనిద్వారా ట్రాకింగ్ చేయటంతో జిల్లాలో ఉన్న పెండింగ్ కేసులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
సైబర్ కేసులపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. మచిలీపట్నం సైబర్ క్రైం పోలీసులకు నూతన సాఫ్ట్వేర్లు, కేసుల ఛేదనపై ప్రత్యేక శిక్షణనిచ్చామని వివరించారు. సైబర్ ల్యాబ్‌ను పటిష్టపరిచినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఎస్పీ తెలిపారు.