AWARDS TO SCR: సహజ ఇంధన పరిరక్షణ, అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థంగా వినియోగించినందుకు దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించాయి.
2021 ఏడాదికి గాను.. పలు కేటగిరీల్లో 4 అవార్డులను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. వాటిలో.. భవనాల కేటగిరిలో ఆసుపత్రుల విభాగం కింద విజయవాడ డివిజినల్ రైల్వే ఆసుపత్రి మొదటి బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో కాచిగూడ స్టేషన్ చారిత్రక కట్టడానికి మొదటి బహుమతి దక్కింది. సంస్థల కేటగిరిలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ రెండవ బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయ భవనం 'సంచాలన్ భవన్' కు మెరిట్ సర్టిఫికెట్ లభించింది.
14 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు జరిగే 31వ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవార్డులను అందజేయనున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంలో కృషి చేసిన అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య అభినందించారు.