అత్త కోడళ్ల మధ్యన జరిగిన గొడవ తల్లిని హత్య చేసే వరకు దారితీసిన ఘటన.. తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలో చోటుచేసుకుంది. పోలికే పాడు గ్రామానికి చెందిన మంకలి నరసయ్య, కాశమ్మలకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన శివకు 8 నెలల కిందట వివాహం చేశారు. అప్పటి నుంచి తల్లిదండ్రులిద్దరూ అతని వద్దనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో శివ భార్య రేణుకకు, అతని తల్లి కాశమ్మకు మధ్య చిన్న చిన్న తగాదాలు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి కూడా అత్తాకోడలు గొడవ పడడంతో కాశమ్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. కాసేపటి తర్వాత ఆమె తిరిగి ఇంటికి రావడంతో మరోసారి వారి మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో కాశమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది.
అది గమనించిన కోడలు రేణుక... కాశమ్మ చేతిలోని అగ్గి పెట్టెను లాక్కుంది. వారి గొడవ కారణంగా తీవ్ర కోపోద్రిక్తుడైన కుమారుడు శివ గొడ్డలితో తల్లి మెడపై నరికాడు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిన కాశమ్మ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు.