తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమి భయం పట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా అని విమర్శించారు. కేసీఆర్ కావాలనే సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో పార్టీ ముఖ్యనాయకులతో కర్నూలులో ఆయన సమావేశం నిర్వహించారు. రాయలసీమలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటన్నింటిపై రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సింది పోయి..వివాదాలు పెట్టుకోవటం తెలుగు రాష్ట్రాల సీఎంలకు మంచిది కాదని హితవు పలికారు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజున..కృష్ణా నీటి విషయంలో ఎలాంటి వివాదాలకు వెళ్లమని చెప్పిన కేసీఆర్...తన మాటలను విస్మరించారన్నారు. కృష్ణా బోర్డు, బచావత్ ట్రిబ్యునల్ ఉండగా జల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానికి ఎందుకు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. జగన్, సజ్జల, షర్మిల మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారని ఆయన దుయ్యబట్టారు. భద్రాచలం సహా చర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాలను కోల్పోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందన్నారు.