Somu Letter To CM: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగలేఖ రాశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల వీడియోని తన లేఖకు జతచేశారు. ఉత్తరాంధ్రలో ఎటుచూసినా నిర్మాణం పూర్తి కాని మొండిగోడలు, చుక్కనీరు లేని కాల్వల వ్యవస్థ, ప్రాజెక్టు ప్రధాన కాల్వల వద్ద గ్రోయిన్స్ నిర్మాణం కాకపోవడంతో సాగునీటి కోసం ఆ ప్రాంత రైతులు ఎదురుచూపులు చూస్తున్నారన్నారు. సాగునీరు లేక మంచి మాగాణీ భూములు సైతం ఎడారిని తలపిస్తున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో నాలుగో వంతు ఉంటుందని, అంతటి విస్తీర్ణం కలిగిన ప్రాంతంలో నీటిపారుదల పథకాలు పూర్తి చేయకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో అధికారుల మంద వైఖరా? ప్రభుత్వ శకుని వైఖరా కారణమనేది అర్ధం కావడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పునరావాస ప్యాకేజీలు అమలు చేయరని.. కాల్వల నిర్మాణం జరగదని.. కాల్వలు ఉంటే గ్రోయిన్స్ లేవని ఈ విధంగా ప్రతి ప్రాజెక్టు ఏదో ఒక దశలో అపరిష్కృతంగా ఉంచారన్నారు.